
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో భారత డబుల్స్ క్రీడాకారులు ఆధిపత్యం ప్రదర్శించాలంటే మరింత సమయం పడుతుందని బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప అభిప్రాయపడింది. డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాధిస్తోన్న పురోగతిపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగం సరైన దిశలో వెళ్తోంది. ఆటగాళ్లు జతగా గొప్ప విజయాలను సాధిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్– చిరాగ్ జంట కొరియా, ఫ్రాన్స్ సూపర్ సిరీస్‌ల్లో క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్‌డ్ కేటగిరీలోనూ సిక్కిరెడ్డి– ప్రణవ్ జపాన్ ఓపెన్ సెమీస్‌కు చేరారు. ఇవన్నీ చాలా గొప్ప విజయాలు. ఇవి ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి.
కానీ ప్రపంచ వేదికపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించాలంటే మాత్రం భారత్‌కు ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే మనం గాడిలో పడుతున్నాం’ అని అశ్విని చెప్పింది. బుధవారం ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆమె మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డితో, మిక్స్‌డ్ డబుల్స్‌తో సాత్విక్ సాయిరాజ్‌తో కలిసి విజేతగా నిలిచింది. గతంలో రెండు సార్లు (2009, 2013లో) గుత్తాజ్వాలతో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన అశ్వినికి ఇదే తొలి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో పతకం సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment