ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా..
►నేడు గుజరాత్‌తో తలపడనున్న హైదరాబాద్
►నాకౌట్ చేరాలంటే సన్‌రైజర్స్‌కు గెలుపు తప్పనిసరి
►పరువు కోసం బరిలోకి లయన్స్
కాన్పూర్: మిగతా మ్యాచ్‌లతో ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్‌పై చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఇప్పటికే నాకౌట్ దశకు దూరమైన గుజరాత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
సమతూకంగా సన్‌రైజర్స్..
ఈ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తను సాధించిన ఏడు విజయాల్లో ఆరు సొంతగడ్డ హైదరాబాద్‌లో సాధించినవే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఏడు విజయాలు, ఐదు పరాజయాలు వార్నర్‌సేన నమోదు చేయగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దీంతో 15 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే శనివారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేకపోతే ఆదివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్–కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఫలితం తనకు అనుకూలంగా ఉండాలి. అంటే ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై పుణే విజయం సాధించాల్సి ఉంటుంది.
దీంతో నాలుగోజట్టుగా ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్ అర్హత సాధిస్తుంది. అయితే నాకౌట్ బెర్త్ కోసం అంతవరకు వేచి చూడకుండా గుజరాత్‌పై విజయం సాధించి సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ గెలుపొందింది. తొలుత బౌలర్లు తక్కువ స్కోరుకే ముంబైని పరిమితం చేయగా.. అనంతరం శిఖర్ ధావన్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ గెలుపొందింది. మరోసారి జట్టు నుంచి ఇలాంటి సమష్టి ప్రదర్శననే జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 535 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను కైవసం చేసుకున్నాడు. తను ఇలాంటి ఫామ్‌నే కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
మరోవైపు శిఖర్ ధావన్ (450 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నాడు. మోజెస్ హెన్రిక్స్ (273 పరుగులు), యువరాజ్ సింగ్ (243), కేన్ విలియమ్సన్ (232) ఆకట్టుకుంటున్నారు. అయితే మరోసారి విలియమ్సన్ బెంచ్‌కే పరిమిత కావచ్చు. అతని స్థానంలో అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ జట్టులోకి రావచ్చు. నమన్ ఓజా సత్తా చాటాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ సన్‌రైజర్స్ సొంతమనడంలో సందేహం లేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌లాడిన భువీ.. 14 సగటుతో 23 వికెట్లను కైవసం చేసుకుని టోర్నీలోనే అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను భువీ సొంతం చేసుకున్నాడు.
సిద్దార్థ్ కౌల్ (15 వికెట్లు), అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ (14) అదరగొడుతున్నాడు. మహ్మద్ సిరాజ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ లయన్స్ చేతిలో ఒక్కసారీ హైదరాబాద్ ఓడిపోలేదు. గత సీజన్‌లో రెండుసార్లు, ఈ సీజన్‌లో ఓ సారి గుజరాత్‌పై వార్నర్‌సేన విజయం సాధించింది. ఈ మూడుసార్లు ఛేదనలోనే హైదరాబాద్ గెలుపొందడం విశేషం. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని భావిస్తోంది. జట్టు ట్రాక్ రికార్డు చూసుకున్నా, ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నా ఈ మ్యాచ్‌లో హైదరాబాదే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
పరువు కోసం పాకులాట..
మరోవైపు గత సీజన్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ ఆ ఏడాది అదరగొట్టింది. అద్భుత విజయాలతో మూడోస్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది గుజరాత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యంతో చాలా ఓటములను మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన గుజరాత్ నాలుగు విజయాలు, తొమ్మిది పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో పుణే, గుజరాత్‌లకు స్థానం లేదు కాబట్టి, సాంకేతికంగా లయన్స్ ఆడుతున్న చివరి మ్యాచ్‌గా దీన్ని భావించవచ్చు. దీంతో చివరి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి సగౌరవంగా తప్పుకోవాలని గుజరాత్ భావిస్తోంది. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ సురేశ్ రైనా ఆకట్టుకుంటున్నాడు.
ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లాడిన రైనా 440 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దినేశ్ కార్తిక్ (361 పరుగులు), బ్రెండన్ మెకల్లమ్ (320), ఆరోన్ ఫించ్ (298), ఇషాన్ కిషన్ (216), డ్వేన్ స్మిత్ (185 పరుగులు)తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటాల్సి ఉంది. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఢిల్లీతో జరిగిన చివరిమ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే రనౌట్లను చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే బాసిత్ థంప్సి (11 వికెట్లు) ఆకట్టుకుంటున్నాడు. 12 వికెట్లు తీసిన ఆండ్రూ టై జట్టు నుంచి దూరం కావడం లయన్స్ ఎదురుదెబ్బగా పరిణమించింది. జేమ్స్ ఫాల్క్‌నర్, ప్రదీప్ సాంగ్వాన్, ధావల్ కులకర్ణి రాణించాని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు హైదరాబాద్‌పై గెలవని గుజరాత్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి వార్నర్‌సేన ప్లే ఆఫ్ ఆశలపై దెబ్బ కొట్టాలని వ్యూహాల్ని రచిస్తోంది.