
నాడు తండ్రి... నేడు తనయ
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అరుదైన ఘనత సాధించింది. 28 ఏళ్ల క్రితం తన తండ్రి పీవీ రమణ సాధించిన ఘనతను ఆమె పునరావృతం చేసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన 1986 ఆసియా క్రీడల్లో రమణ భారత పురుషుల వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ క్రీడల్లో భారత వాలీబాల్ జట్టుకు కాంస్య పతకం లభించింది. దక్షిణ కొరియాలో మరోసారి ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈసారి రమణ కూతురు సింధు కాంస్యం నెగ్గిన భారత మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో సభ్యురాలిగా ఉండటం విశేషం. తాజా ప్రదర్శనతో సింధు ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. - సాక్షి క్రీడావిభాగం