
ఇండోర్: పదేళ్ల తర్వాత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని గెలుచుకోవాలని ఓ జట్టు... ఫైనల్‌కు వచ్చిన తొలిసారే టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించాలని మరో జట్టు తుది పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి ఇండోర్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీ, విదర్భ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశను రెండో స్థానంతో ముగించిన ఢిల్లీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌పై, సెమీస్‌లో బెంగా ల్‌పై విజయాలతో ఫైనల్‌కు రాగా.. ఈ సీజన్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా క్వార్టర్స్ చేరిన విదర్భ అక్కడ కేరళను, సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి ఫైనల్ చేరింది. గతంలో ఏడు సార్లు రంజీ టైటిల్‌ను సాధించిన రికార్డు ఢిల్లీకి ఉంది.
గంభీర్ రాణించేనా...
గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, ఉన్ముక్త్ చంద్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 95 పరుగులతో పాటు సెమీస్‌లో బెంగాల్‌పై సెంచరీ చేసిన సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్‌పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ కునాల్ చండేలా కూడా సెమీస్‌లో సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్‌లో నితీశ్ రాణా కూడా కీలకం కానున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే పేసర్ నవదీప్ సైనీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకుంటుండగా... అతనికి కర్నాల్, కుల్వంత్‌లు చక్కగా సహకరిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్లు వికాస్ మిశ్రా, మనన్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థికి సవాలే.
సంచలనం సృష్టిస్తుందా...
ఈ సీజన్‌లో ఇప్పటివరకు నిలకడగా రాణిస్తూ... ఫైనల్ చేరిన విదర్భ తొలిసారే సంచలనం సృష్టించాలని చూస్తోంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌లు మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కెప్టెన్, ఓపెనర్ ఫైజ్ ఫజల్ ఈ సీజన్‌లో 76.63 సగటుతో 843 పరుగులు సాధించి మంచి ఊపు మీదుండగా... మరో ఓపెనర్ సంజయ్ రామస్వామి 735 పరుగులతో అతనికి అండగా నిలుస్తూ వచ్చాడు. వీరికి తోడు రంజీ రికార్డుల వీరుడు వసీం జాఫర్ ఆ జట్టుతో ఉండటం అదనపు బలం. విదర్భ కోచ్ చంద్రకాంత్, సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌లకు గతంలో ముంబై తరఫున ఈ మెగా టోర్నీ గెలిచిన అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన పేసర్ గుర్బానీ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని ఆ జట్టు కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment