vidrbha
-
105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
విదర్భ స్టార్ ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ఫైనల్ విజయనంతరం వాఖరే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్బ విజయం సాధించింది. ఫైనల్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ ఛాంపియన్‌గా అవతరించింది. అయితే ఈ మ్యాచ్‌లో వాఖరేకు ఆడే అవకాశం లభించలేదు. అతడు చివరగా తమిళనాడుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్బకు ప్రాతినిథ్యం వహిచాడు. ‘రంజీ చాంపియన్ జట్టులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. విజేతగా వీడ్కోలు పలకడం కంటే ఇంకేం కావాలి. 100 మ్యాచ్‌ల అనంతరం తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ జట్టు అవసరాల దృష్ట్యా సీజన్ ముగిసేవరకు కొనసాగాను’ అని 39 ఏళ్ల వాఖరే వెల్లడించాడు. 2006-07 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అక్షయ్.. విదర్బ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన సంచలన ప్రదర్శనతో విదర్భకు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించాడు. మూడోసారి విదర్భ విజేతగా నిలవడంతో వాఖరే తనవంతు పాత్ర పోషించాడు. దేశవాళీల్లో 105 మ్యాచ్‌లాడిన ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ 344 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్లో 3 పది వికెట్ హాల్స్, 21 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.విదర్భకు భారీ నజరానా..మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు.చదవండి: Champions Trophy: ఆసీస్‌తో సెమీఫైనల్.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా? -
ముచ్చటగా మూడో సారి.. విదర్బ విజయం వెనక మాస్టర్ మైండ్
జట్టులో స్టార్స్ ఎవరూ లేకున్నా... సమష్టితత్వమే విజయ మంత్రంగా ముందుకు సాగితే అద్భుతాలు చేయవచ్చని... అవసరమైన ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకునేలా తరీఫదునిస్తే ఫలితాలు వాటంతటే అవే వస్తాయని విదర్భ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఆరేళ్ల క్రితం వరుసగా రెండు సీజన్లలో రంజీ ట్రోఫీ టైటిల్ సాధించిన విదర్భ ఆ తర్వాత తడబడింది.కానీ ఈసారి మాత్రం అందరూ తమవైపు చూసేలా ఆడుతూ చివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రంజీ రారాజు తామేనని చాటుకుంది. బ్యాటింగ్‌లో యశ్ రాథోడ్, కరుణ్ నాయర్, దానిశ్ మాలేవర్, అక్షయ్ వాడ్కర్ మెరిస్తే... బంతితో హర్‡్ష దూబే రికార్డులు తిరగరాశాడు. వెరసి విదర్భ మూడోసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది.గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిన విదర్భ జట్టు... ఈ సీజన్ కోసం పెద్ద కసరత్తే చేసింది. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ నుంచి మొదలుకొని... తుది జట్టు ఎంపిక వరకు ప్రతి దానిపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలు సాధించింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న విదర్భ జట్టు.. సమష్టి కృషితో కదంతొక్కి మూడోసారి రంజీ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ ఓటమి రుచిచూడని విదర్భ... తొమ్మిది దశాబ్దాల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి రెండు విడతలుగా మ్యాచ్‌లు నిర్వహించినా ఎక్కడా లయ కోల్పోలేదు.యువ ఆటగాళ్లపై నమ్మకముంచడం... వారికి బాధ్యతలు ఇచ్చి మెరుగైన ప్రదర్శన రాబట్టుకోవడం వల్లే విదర్భ మూడోసారి విజేతగా నిలవగలిగింది. ఫలితంగానే 22 ఏళ్ల హర్ష్ దూబే అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకోగా... 24 ఏళ్ల యశ్ రాథోడ్ అత్యధిక పరుగులు చేసిన వారిలో ‘టాప్’గా నిలిచాడు. కేవలం యువ ఆటగాళ్ల మీదే భారం వేయకుండా అనుభవజ్ఞులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విదర్భ మేనేజ్మెంట్ సఫలీకృతమైంది. భారత జట్టు తరఫున 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ ఈ సీజన్లో విదర్భ తరఫున విజృంభించాడు. రంజీ సీజన్ మధ్యలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 5 శతకాలు బాదిన నాయర్... రంజీ ట్రోఫీలో మరో నాలుగు సెంచరీలతో చెలరేగాడు. సంపూర్ణ ఆధిపత్యం... లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి... ఒక దాన్ని ‘డ్రా’ చేసుకొని 40 పాయింట్లతో నాకౌట్‌కు చేరిన విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక కీలక సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై 80 పరుగుల తేడాతో గెలిచి... గతేడాది ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. మరోవైపు జమ్మూకశీ్మర్‌తో క్వార్టర్ ఫైనల్లో ఒక పరుగు, గుజరాత్‌తో సెమీఫైనల్లో రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి ముందంజ వేసిన కేరళ జట్టు చివరకు తుదిపోరులో అదే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.తుదిపోరులో ఒక దశలో కేరళ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న సమయంలో హర్‡్ష దూబే మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ సీజన్లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన హర్‡్ష 69 వికెట్లు పడగొట్టి... ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బ్యాటింగ్‌లోనూ మెరిసిన అతడు 476 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సలహాలతో ఆల్‌రౌండర్‌గా మరింత రాటుదేలుతున్న హర్‡్ష... భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తదుపరి లక్ష్యమని అన్నాడు.అదరగొట్టిన యశ్ రాథోడ్ విదర్భ జట్టు మూడోసారి రంజీ విజేతగా నిలవడంలో యువ బ్యాటర్ యశ్ రాథోడ్ పాత్ర కీలకం. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లాడిన యశ్... 53.33 సగటుతో 960 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ‘టాప్’ ప్లేస్‌లో నిలిచాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందే విదర్భ జట్టుతో చేరిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... 53.93 సగటుతో 863 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాయర్ నాలుగో స్థానంలో నిలిచాడు. కేరళతో ఫైనల్లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 86, 135 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 153, 73 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న 21 ఏళ్ల మాలేవర్... సీజన్లో 52.20 సగటుతో 783 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగులు జతచేసిన కరుణ్ నాయర్, మాలేవర్ జోడీ... రెండో ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. దీంతో కేరళ జట్టు తిరిగి కోలుకునే అవకాశం లేకుండా పోయింది. 10 మ్యాచ్‌ల్లో 45.12 సగటుతో 722 పరుగులు చేసిన విదర్భ సారథి అక్షయ్ వాడ్కర్... సమష్టి కృషికి దక్కిన అత్యుత్తమ ఫలితం ఇదని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంతోనే మూడోసారి రంజీ ట్రోపీ చేజిక్కించుకున్నామని పేర్కొన్నాడు. స్టార్లు లేకపోయినా... పెద్దగా పేరున్న ఆటగాళ్లు జట్టులో లేకపోయినా... కేవలం ‘టీమ్ వర్క్’పైనే ఆధారపడ్డ విదర్భ జట్టు సీజన్ ఆసాంతం చక్కటి ప్రదర్శన కనబర్చి దేశవాళీల్లో మెరుగైన జట్టుగా పరిణతి చెందింది. విదర్భ విజయం వెనక హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీ మాస్టర్ మైండ్ ఉంది. ఉస్మాన్ ఘనీ కోచింగ్‌లో ఆరితేరిన విదర్భ జట్టు ఏ స్థాయిలోనూ పట్టు సడలించలేదు. ‘ఈసారి జట్టులో అటు యువ ఆటగాళ్లు, ఇటు అనుభవజ్ఞులు ఉండేలా చూసుకున్నాం. ఇది జట్టంతా కలిసి తీసుకున్న నిర్ణయం. కేవలం ట్రోఫీ గెలవడమే కాదు. మున్ముందు జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించాలనే లక్ష్యంతో పనిచేశాం. హర్‡్ష దూబేకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతి ఆటగాడికి అది ముఖ్యం. కేవలం బౌలర్‌గానే కాకుండా... అతడు బ్యాట్‌తోనూ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీజన్ ఆసాంతం రాణించడం వల్లే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రంజీ ఫైనల్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అక్షయ్ వాఖరే... కీలక మ్యాచ్‌ల్లో హర్‡్షకు దిశానిర్దేశం చేశాడు. బ్యాటింగ్‌లో యశ్ రాథోడ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అతడిలో చాలా నైపుణ్యం ఉంది. కరుణ్ నాయర్ అనుభవం మాకెంతో పనికి వచ్చింది. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేయడమే విజయానికి బాటలు వేసింది. గతేడాది జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం దక్కని దానిశ్ మాలేవర్ ఈసారి నిరూపించుకున్నాడు. ఫైనల్లో అతడి తెగువ అసమానం. ఇలా ప్రతి ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు’ అని ఉస్మాన్ వెల్లడించాడు. -
అది నా చేతిలో లేదు.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: కరుణ్ నాయర్
దేశవాళీ క్రికెట్లో భారత వెటరన్ బ్యాటర్, విదర్భ స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. విదర్బ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 295 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో 5 సెంచరీలు చేసిన కరుణ్ నాయర్‌కు ఓవరాల్‌గా ఈ సీజన్లో ఇది 9వ శతకం కావడం విశేషం.అతడు సెంచరీ ఫలితంగా విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఆఖరి రోజు ఆటలో విదర్బ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 110.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 37 పరుగులతో కలుపుకొని విదర్భ ఓవరాల్‌గా 324 పరుగుల ముందంజలో ఉంది. ఇక తన సెంచరీపై నాలుగో రోజు అనంతరం కరుణ్ నాయర్ స్పందించాడు."మైదానంలో అడుగుపెడితే పరుగులు సాధించడమే నా పని. ప్రస్తుతం అదే చేస్తున్నా. భారత జట్టుకు తిరిగి ఎంపికవడం నా చేతిలో లేదు. దానిపై ఏం వ్యాఖ్యానించలేను. ఈ మ్యాచ్‌కు ముందు 8 శతకాలు చేశాను. జట్టు సహాయ సిబ్బందితో దీని గురించి మాట్లాడా. ఈ రోజు సెంచరీ చేస్తే తొమ్మిదో అంకే చూపుతానని చెప్పా. అది సాధ్యమైంది కాబట్టే అలా సంజ్ఞ చేశా. నేను క్రీజులో అడుగుపెట్టినప్పుడు జట్టు 7/2తో ఉంది. దీంతో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలని ముందే అనుకున్నా.కొన్ని కఠిన సవాళ్లు ఎదురైన సెంచరీ పూర్తిచేసుకొని అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆదివారం కూడా ఇదే ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాం. తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ కావడం ఎంతో బాధించింది. లేకపోతే అప్పుడు కూడా శతకం సాధిస్తానని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ఓపిగ్గా ప్రయత్నించి పరుగులు రాబట్టా. నాకు ఇది నాలుగో రంజీ ట్రోఫీ ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా" అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.చదవండి: IML 2025: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
దానిశ్ ధమాకా.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన విదర్భ
నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విదర్బ తమ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. 254/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన విదర్బ.. అదనంగా 123 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. విదర్బ బ్యాటర్లలో యువ ఆటగాడు దానిశ్ మాలేవర్ (259 బంతుల్లో 153; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కాగా ఆరంభంలో కేరళ బౌలర్ల విజృంభణతో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (188 బంతుల్లో 86; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి దానిశ్ ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 బంతుల్లో 215 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. వీరిద్దరితో పాటు ఆఖరిలో నచికేత్ భూతే 32 పరుగులతో రాణించాడు.మూడేసిన ఈడెన్, నిధీష్..మొదటిసారి రంజీ ఫైనల్ ఆడుతున్న కేరళ జట్టు... ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించినా, దాన్ని చివరివరకు కొనసాగించలేకపోయింది. మొదటి రోజు ఉదయం పచ్చికతో కూడిన పిచ్‌పై విజృంభించిన కేరళ బౌలర్లు బంతి పాతబడ్డ అనంతరం అదే జోరును కంటిన్యూ చేయలేకపోయారు. కేరళ బౌలర్లలో ఈడెన్ ఆపిల్ టామ్, నిధీష్ తలా మూడు వికెట్లు సాధించగా..బసిల్ రెండు, సక్సేనా తలా వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
రంజీ ట్రోఫీ ఫైనల్.. జట్టును ప్రకటించిన విదర్భ
మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రెండుసార్లు చాంపియన్ విదర్భ జట్టు ఈనెల 26 నుంచి కేరళ జట్టుతో జరిగే ఫైనల్ కోసం జట్టును ప్రకటించింది. గుజరాత్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో పోటీపడ్డ 17 మంది సభ్యులనే ఫైనల్ మ్యాచ్‌కూ కొనసాగించాలని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.అక్షయ్ వాడ్కర్ జట్టుకు సారథ్యంలోనే విదర్భ ఫైనల్లో బరిలోకి దిగుతుందని వీసీఏ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సీజన్లో విదర్భ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు అర్హత సాధించింది. గత ఏడాది 42 సార్లు రంజీ చాంపియన్ ముంబై జట్టు చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.ఈ సీజన్లో యశ్ రాథోడ్ (933 పరుగులు), హర్‡్ష దూబే (66 వికెట్లు) నిలకడగా రాణించి విదర్భ జట్టు ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించారు. విదర్భ జట్టు 2017–18, 2018–19 వరుస సీజన్లలో రంజీ చాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ జట్టు: అక్షయ్ వాడ్కర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అథర్వ తైడె, కరుణ్ నాయర్, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, యశ్ కదమ్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, అమన్ మొఖాడె, అక్షయ్ కర్నెవార్, అక్షయ్ వఖారె, ఆదిత్య థాకరే, దర్శన్ నల్కండే, నచికేత్ భుటె, సిద్ధేశ్ వథ్, దానిశ్ మలెవార్, పార్థ్ రఖాడె.చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్ -
'ఆ ఒక్క మ్యాచ్‌తోనే నా కెరీర్‌కు ఎండ్ కార్డ్.. చాలా బాధపడ్డా'
భారత్ తరపున అరంగేట్రం చేసి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఒకరు. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫజల్.. తన తొలి మ్యాచ్‌లోనే అకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఫజల్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కానీ దురదృష్టవశాత్తూ భారత జట్టుతో తన ప్రయాణం తొలి మ్యాచ్‌తోనే ఆగిపోయింది. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అకట్టుకున్నప్పటికి అతడికి ఆ తర్వాత భారత జట్టులో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో ఇటీవలే ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఫజల్ విడ్కోలు పలికాడు. 2023-24 రంజీ సీజన్లో హర్యానాతో మ్యాచ్ అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. అయితే తాజాగా టీమిండియా తరపున కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడటంపై ఫజల్ స్పందించాడు. తొలి మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికి తర్వాత భారత్‌కు ఆడే అవకాశాలు రాకపోవడంతో చాలా బాధపడ్డానని ఫజల్ తెలిపాడు. "నేను చాలా ఎమోషనల్. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడతాను. అదే విధంగా ఆ చిన్న విషయాలే నన్ను సంతోష పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టీమిండియా తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను టీమిండియా క్యాప్‌ను అందుకోగానే నా ఫ్యామిలీ కూడా చాలా సంతోష పడ్డారు. కానీ ఒక్క మ్యాచ్‌తో నా సంతోషం ఆవిరి అయిపోయింది. వెనక్కి తిరిగి నా కెరీర్‌ను చూస్తే కేవలం ఒకే మ్యాచ్ కన్పిస్తోంది. దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు మరి ఛాన్స్ లభించలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఇంకో విషయమేంటంటే అప్పటి జట్టులో నేను ఒక్కడినే ఐపీఎల్లో ఆడలేదని" ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫజల్ పేర్కొన్నాడు. -
విదర్భ అద్భుతం చేస్తుందా!
ఇండోర్: పదేళ్ల తర్వాత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని గెలుచుకోవాలని ఓ జట్టు... ఫైనల్‌కు వచ్చిన తొలిసారే టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించాలని మరో జట్టు తుది పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి ఇండోర్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీ, విదర్భ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశను రెండో స్థానంతో ముగించిన ఢిల్లీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌పై, సెమీస్‌లో బెంగా ల్‌పై విజయాలతో ఫైనల్‌కు రాగా.. ఈ సీజన్లో ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా క్వార్టర్స్ చేరిన విదర్భ అక్కడ కేరళను, సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి ఫైనల్ చేరింది. గతంలో ఏడు సార్లు రంజీ టైటిల్‌ను సాధించిన రికార్డు ఢిల్లీకి ఉంది. గంభీర్ రాణించేనా... గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, ఉన్ముక్త్ చంద్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 95 పరుగులతో పాటు సెమీస్‌లో బెంగాల్‌పై సెంచరీ చేసిన సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్‌పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ కునాల్ చండేలా కూడా సెమీస్‌లో సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో నితీశ్ రాణా కూడా కీలకం కానున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే పేసర్ నవదీప్ సైనీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకుంటుండగా... అతనికి కర్నాల్, కుల్వంత్లు చక్కగా సహకరిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్లు వికాస్ మిశ్రా, మనన్లను ఎదుర్కోవడం ప్రత్యర్థికి సవాలే. సంచలనం సృష్టిస్తుందా... ఈ సీజన్లో ఇప్పటివరకు నిలకడగా రాణిస్తూ... ఫైనల్ చేరిన విదర్భ తొలిసారే సంచలనం సృష్టించాలని చూస్తోంది. టాపార్డర్ బ్యాట్స్మెన్లు మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కెప్టెన్, ఓపెనర్ ఫైజ్ ఫజల్ ఈ సీజన్లో 76.63 సగటుతో 843 పరుగులు సాధించి మంచి ఊపు మీదుండగా... మరో ఓపెనర్ సంజయ్ రామస్వామి 735 పరుగులతో అతనికి అండగా నిలుస్తూ వచ్చాడు. వీరికి తోడు రంజీ రికార్డుల వీరుడు వసీం జాఫర్ ఆ జట్టుతో ఉండటం అదనపు బలం. విదర్భ కోచ్ చంద్రకాంత్, సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌లకు గతంలో ముంబై తరఫున ఈ మెగా టోర్నీ గెలిచిన అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన పేసర్ గుర్బానీ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని ఆ జట్టు కోరుకుంటోంది. -
విదర్భకు రూ.30 వేల కోట్లు కావాలి
నాగపూర్: ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడ్డ విదర్భ ప్రాంతానికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని విదర్భ జనాందోళన్ సమితి (వీజేఏఎస్) డిమాండ్ చేసింది. విదర్భ వ్యవసాయ సంక్షోభం, ఇక్కడి రైతుల దుస్థితిని దృష్టిలో ఉంచుకొని భారీగా సాయం అందించాలని వీజేఏఎస్ అధ్యక్షుడు కిశోర్ తివారీ సోమవారం కోరారు. రైతుల రుణాల మాఫీ, పంటల ప్రోత్సాహం, భారీ సూక్ష్మసేద్యం పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అత్యున్నత కమిటీని నియమించాలని తివారీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆరేళ్లలో మహారాష్ట్ర, యూపీఏ ప్రభుత్వం విదర్భ కోసం రూ.ఐదువేల కోట్లు వ్యయం చేసినా ఆత్మహత్యలు ఆగలేదని, ఇక్కడ వెనుకబాటుతనం తగ్గడం లేదని పేర్కొన్నారు.