
జట్టులో స్టార్స్ ఎవరూ లేకున్నా... సమష్టితత్వమే విజయ మంత్రంగా ముందుకు సాగితే అద్భుతాలు చేయవచ్చని... అవసరమైన ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకునేలా తరీఫదునిస్తే ఫలితాలు వాటంతటే అవే వస్తాయని విదర్భ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఆరేళ్ల క్రితం వరుసగా రెండు సీజన్లలో రంజీ ట్రోఫీ టైటిల్ సాధించిన విదర్భ ఆ తర్వాత తడబడింది.
కానీ ఈసారి మాత్రం అందరూ తమవైపు చూసేలా ఆడుతూ చివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రంజీ రారాజు తామేనని చాటుకుంది. బ్యాటింగ్‌లో యశ్ రాథోడ్, కరుణ్ నాయర్, దానిశ్ మాలేవర్, అక్షయ్ వాడ్కర్ మెరిస్తే... బంతితో హర్‡్ష దూబే రికార్డులు తిరగరాశాడు. వెరసి విదర్భ మూడోసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది.
గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిన విదర్భ జట్టు... ఈ సీజన్ కోసం పెద్ద కసరత్తే చేసింది. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ నుంచి మొదలుకొని... తుది జట్టు ఎంపిక వరకు ప్రతి దానిపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలు సాధించింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న విదర్భ జట్టు.. సమష్టి కృషితో కదంతొక్కి మూడోసారి రంజీ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ ఓటమి రుచిచూడని విదర్భ... తొమ్మిది దశాబ్దాల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి రెండు విడతలుగా మ్యాచ్‌లు నిర్వహించినా ఎక్కడా లయ కోల్పోలేదు.
యువ ఆటగాళ్లపై నమ్మకముంచడం... వారికి బాధ్యతలు ఇచ్చి మెరుగైన ప్రదర్శన రాబట్టుకోవడం వల్లే విదర్భ మూడోసారి విజేతగా నిలవగలిగింది. ఫలితంగానే 22 ఏళ్ల హర్ష్ దూబే అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకోగా... 24 ఏళ్ల యశ్ రాథోడ్ అత్యధిక పరుగులు చేసిన వారిలో ‘టాప్’గా నిలిచాడు. కేవలం యువ ఆటగాళ్ల మీదే భారం వేయకుండా అనుభవజ్ఞులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విదర్భ మేనేజ్‌మెంట్ సఫలీకృతమైంది.
భారత జట్టు తరఫున 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ ఈ సీజన్‌లో విదర్భ తరఫున విజృంభించాడు. రంజీ సీజన్ మధ్యలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 5 శతకాలు బాదిన నాయర్... రంజీ ట్రోఫీలో మరో నాలుగు సెంచరీలతో చెలరేగాడు.
సంపూర్ణ ఆధిపత్యం...
లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి... ఒక దాన్ని ‘డ్రా’ చేసుకొని 40 పాయింట్లతో నాకౌట్‌కు చేరిన విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక కీలక సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై 80 పరుగుల తేడాతో గెలిచి... గతేడాది ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. మరోవైపు జమ్మూకశీ్మర్‌తో క్వార్టర్ ఫైనల్లో ఒక పరుగు, గుజరాత్‌తో సెమీఫైనల్లో రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి ముందంజ వేసిన కేరళ జట్టు చివరకు తుదిపోరులో అదే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
తుదిపోరులో ఒక దశలో కేరళ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న సమయంలో హర్‡్ష దూబే మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ సీజన్‌లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన హర్‡్ష 69 వికెట్లు పడగొట్టి... ఒక రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బ్యాటింగ్‌లోనూ మెరిసిన అతడు 476 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సలహాలతో ఆల్‌రౌండర్‌గా మరింత రాటుదేలుతున్న హర్‡్ష... భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తదుపరి లక్ష్యమని అన్నాడు.
అదరగొట్టిన యశ్ రాథోడ్
విదర్భ జట్టు మూడోసారి రంజీ విజేతగా నిలవడంలో యువ బ్యాటర్ యశ్ రాథోడ్ పాత్ర కీలకం. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన యశ్... 53.33 సగటుతో 960 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ‘టాప్’ ప్లేస్‌లో నిలిచాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందే విదర్భ జట్టుతో చేరిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... 53.93 సగటుతో 863 పరుగులు సాధించాడు.
ఇందులో 4 శతకాలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాయర్ నాలుగో స్థానంలో నిలిచాడు. కేరళతో ఫైనల్లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 86, 135 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 153, 73 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న 21 ఏళ్ల మాలేవర్... సీజన్‌లో 52.20 సగటుతో 783 పరుగులు సాధించాడు.
అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగులు జతచేసిన కరుణ్ నాయర్, మాలేవర్ జోడీ... రెండో ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. దీంతో కేరళ జట్టు తిరిగి కోలుకునే అవకాశం లేకుండా పోయింది. 10 మ్యాచ్‌ల్లో 45.12 సగటుతో 722 పరుగులు చేసిన విదర్భ సారథి అక్షయ్ వాడ్కర్... సమష్టి కృషికి దక్కిన అత్యుత్తమ ఫలితం ఇదని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంతోనే మూడోసారి రంజీ ట్రోపీ చేజిక్కించుకున్నామని పేర్కొన్నాడు.
స్టార్లు లేకపోయినా...
పెద్దగా పేరున్న ఆటగాళ్లు జట్టులో లేకపోయినా... కేవలం ‘టీమ్ వర్క్’పైనే ఆధారపడ్డ విదర్భ జట్టు సీజన్ ఆసాంతం చక్కటి ప్రదర్శన కనబర్చి దేశవాళీల్లో మెరుగైన జట్టుగా పరిణతి చెందింది. విదర్భ విజయం వెనక హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీ మాస్టర్ మైండ్ ఉంది. ఉస్మాన్ ఘనీ కోచింగ్‌లో ఆరితేరిన విదర్భ జట్టు ఏ స్థాయిలోనూ పట్టు సడలించలేదు.
‘ఈసారి జట్టులో అటు యువ ఆటగాళ్లు, ఇటు అనుభవజ్ఞులు ఉండేలా చూసుకున్నాం. ఇది జట్టంతా కలిసి తీసుకున్న నిర్ణయం. కేవలం ట్రోఫీ గెలవడమే కాదు. మున్ముందు జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించాలనే లక్ష్యంతో పనిచేశాం. హర్‡్ష దూబేకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతి ఆటగాడికి అది ముఖ్యం. కేవలం బౌలర్‌గానే కాకుండా... అతడు బ్యాట్‌తోనూ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీజన్ ఆసాంతం రాణించడం వల్లే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
రంజీ ఫైనల్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అక్షయ్ వాఖరే... కీలక మ్యాచ్‌ల్లో హర్‡్షకు దిశానిర్దేశం చేశాడు. బ్యాటింగ్‌లో యశ్ రాథోడ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అతడిలో చాలా నైపుణ్యం ఉంది. కరుణ్ నాయర్ అనుభవం మాకెంతో పనికి వచ్చింది. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేయడమే విజయానికి బాటలు వేసింది. గతేడాది జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం దక్కని దానిశ్ మాలేవర్ ఈసారి నిరూపించుకున్నాడు. ఫైనల్లో అతడి తెగువ అసమానం. ఇలా ప్రతి ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు’ అని ఉస్మాన్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment