
దేశవాళీల్లో పరుగుల వరద పారించిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ అదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్‌లో కరుణ్ నాయర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కరుణ్ నాయర్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి.
ఇక రంజీ ట్రోఫీలోనూ అదే జోష్ కొనసాగిస్తూ 57.33 సగటు 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు.
‘చాన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కిందపడ్డ ప్రతిసారీ అంతకు రెట్టింపు బలంతో పైకి లేవడానికి ప్రయత్నించా. ప్రస్తుతానికి ఐపీఎల్ మీదే దృష్టి పెట్టా. జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లో టీమ్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఢిల్లీ జట్టుతో చేరడం ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్... కెరీర్‌లో చివరిది అనే విధంగానే కష్టపడతా.
ఢిల్లీ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. ఇటీవలి కాలంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అతడి కెరీర్ ఆరంభం నుంచి దగ్గర నుంచి గమనించా. తిరిగి వాళ్లతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నా. క్యాపిటల్స్‌కు తొలిసారి కప్పు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని నాయర్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment