
నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విదర్బ తమ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. 254/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన విదర్బ.. అదనంగా 123 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
విదర్బ బ్యాటర్లలో యువ ఆటగాడు దానిశ్ మాలేవర్ (259 బంతుల్లో 153; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కాగా ఆరంభంలో కేరళ బౌలర్ల విజృంభణతో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (188 బంతుల్లో 86; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి దానిశ్ ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 బంతుల్లో 215 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. వీరిద్దరితో పాటు ఆఖరిలో నచికేత్ భూతే 32 పరుగులతో రాణించాడు.
మూడేసిన ఈడెన్, నిధీష్..
మొదటిసారి రంజీ ఫైనల్ ఆడుతున్న కేరళ జట్టు... ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించినా, దాన్ని చివరివరకు కొనసాగించలేకపోయింది. మొదటి రోజు ఉదయం పచ్చికతో కూడిన పిచ్‌పై విజృంభించిన కేరళ బౌలర్లు బంతి పాతబడ్డ అనంతరం అదే జోరును కంటిన్యూ చేయలేకపోయారు. కేరళ బౌలర్లలో ఈడెన్ ఆపిల్ టామ్, నిధీష్ తలా మూడు వికెట్లు సాధించగా..బసిల్ రెండు, సక్సేనా తలా వికెట్ సాధించారు.
చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు