
భారత్ తరపున అరంగేట్రం చేసి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఒకరు. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫజల్.. తన తొలి మ్యాచ్‌లోనే అకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఫజల్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కానీ దురదృష్టవశాత్తూ భారత జట్టుతో తన ప్రయాణం తొలి మ్యాచ్‌తోనే ఆగిపోయింది.
తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అకట్టుకున్నప్పటికి అతడికి ఆ తర్వాత భారత జట్టులో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో ఇటీవలే ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఫజల్ విడ్కోలు పలికాడు. 2023-24 రంజీ సీజన్‌లో హర్యానాతో మ్యాచ్ అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు.
అయితే తాజాగా టీమిండియా తరపున కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడటంపై ఫజల్ స్పందించాడు. తొలి మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికి తర్వాత భారత్‌కు ఆడే అవకాశాలు రాకపోవడంతో చాలా బాధపడ్డానని ఫజల్ తెలిపాడు.
"నేను చాలా ఎమోషనల్. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడతాను. అదే విధంగా ఆ చిన్న విషయాలే నన్ను సంతోష పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టీమిండియా తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను టీమిండియా క్యాప్‌ను అందుకోగానే నా ఫ్యామిలీ కూడా చాలా సంతోష పడ్డారు.
కానీ ఒక్క మ్యాచ్‌తో నా సంతోషం ఆవిరి అయిపోయింది. వెనక్కి తిరిగి నా కెరీర్‌ను చూస్తే కేవలం ఒకే మ్యాచ్ కన్పిస్తోంది. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు మరి ఛాన్స్ లభించలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఇంకో విషయమేంటంటే అప్పటి జట్టులో నేను ఒక్కడినే ఐపీఎల్‌లో ఆడలేదని" ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫజల్ పేర్కొన్నాడు.