నాగపూర్: ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడ్డ విదర్భ ప్రాంతానికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని విదర్భ జనాందోళన్ సమితి (వీజేఏఎస్) డిమాండ్ చేసింది. విదర్భ వ్యవసాయ సంక్షోభం, ఇక్కడి రైతుల దుస్థితిని దృష్టిలో ఉంచుకొని భారీగా సాయం అందించాలని వీజేఏఎస్ అధ్యక్షుడు కిశోర్ తివారీ సోమవారం కోరారు. రైతుల రుణాల మాఫీ, పంటల ప్రోత్సాహం, భారీ సూక్ష్మసేద్యం పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అత్యున్నత కమిటీని నియమించాలని తివారీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ఆరేళ్లలో మహారాష్ట్ర, యూపీఏ ప్రభుత్వం విదర్భ కోసం రూ.ఐదువేల కోట్లు వ్యయం చేసినా ఆత్మహత్యలు ఆగలేదని, ఇక్కడ వెనుకబాటుతనం తగ్గడం లేదని పేర్కొన్నారు.