భారత్ కొత్త కోచ్ ఈయనేనా?
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య వచ్చిన మనస్పర్ధలు టామ్ మూడీకి లాభం చేకూర్చుతాయా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. టీమిండియా కోచ్‌కు అప్లికేషన్లు స్వీకరించడం బుధవారంతో ముగిసింది. భారత్ మాజీ క్రికెటర్లు చాలా మంది కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. దరఖాస్తు చేసుకున్న హై ప్రొఫైల్ వ్యక్తుల్లో టామ్ మూడి ఒకరని తెలిసింది. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి టామ్ మూడీకి చాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో కూడ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోచ్ పదవికి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మూడీ గతంలో శ్రీలంకకు కోచ్ వ్యవహరించారని ఆయనకు భారత్ క్రికెట్ పరిస్ధితులపై మంచి అవగాహన ఉందని అన్నారు.