ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. చిద్విలాసంలో చీర్ గర్ల్స్
సాక్షి, ఉప్పల్: హైదరాబాద్ నగరం మరోసారి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. శుక్రవారం నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్న పోటీలు కావడంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు గురువారం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌సీఏ సీఈఓ పాండురంగమూర్తి, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్‌రావు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈవెంట్ ఆర్గనైజర్ సర్వానంద్‌తో కలిసి సీపీ భద్రత అంశాలపై చర్చించారు. ప్రతి మ్యాచ్‌ను అత్యంత భద్రతతో ప్రశాంతంగా నిర్వహించేందుకు అదనపు బలగాలను వినియోగించనున్నారు.
పోలీస్ పహారాలో స్టేడియం
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన 2,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాచకొండ ట్రాఫిక్ సిబ్బంది, ఆరు ప్లటూన్ల ఆర్మ్‌డ్ ఫోర్స్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీసీఎస్ స్టాఫ్‌తో భారీ బందోబస్తు ఉంటుంది. అంతేగాక 300 సీసీ కెమెరాలను స్టేడియం లోపల, పార్కింగ్ ప్రాంతాలలో అమర్చారు. శుక్రవారం మ్యాచ్ జరగనున్నందున ఇప్పటికే పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అవసరమైన చోటల్లా చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్స్ నిరంతరం పహారా కాస్తాయి. సంఘ విద్రోహ శక్తులపై గట్టి నిఘా ఉంచామని, అనుమానితులను ఎప్పటికప్పుడు విచారించి తగు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. గతంలో మాధిరి మహిళా అభిమానుల రక్షణ కోసం షీటీమ్‌లను అందుబాటులో ఉంచామన్నారు.
ఎంఆర్‌పీ రేట్లకే..
స్టేడియంలో తినుబండారాలకు నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్ సూపరివైజింగ్ టీంలను అందుబాటులో ఉంచారు. మ్యాచ్‌లకు మూడు గంటల ముందుగానే క్రీడాభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.
ఆ వస్తువులు తీసుకు రావొద్దు..
ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యూలర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, పెన్నులు, సెంట్లు, సెల్‌ఫోన్ రీచార్జి బ్యాటరీలను స్టేడియంలోనికి అనుమతించరు. మొబైల్ ఫోన్, వాటి ఇయర్‌ఫోన్స్‌ను అనుమతిస్తారు.
పార్కింగ్ మ్యాప్‌ను పరిశీలిస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ తదితరులు
ట్రాఫిక్ దారి మళ్లింపు..
♦ మ్యాచ్‌లు జరుగుతున్న దృష్టా ఉప్పల్ పరిసరాల్లో క్రీడాభిమానులతో సందడి నెలకొంటుంది. దీంతో శుక్రవారం మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో సికింద్రాబాద్– ఉప్పల్ రోడ్డులో వాహనాలను అనుమతించరు.
♦ సికింద్రాబాద్– ఘట్‌కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవేలో వెళ్లాలి. అటు నుంచి వచ్చే వారు కూడా అదే మార్గంలో వెళ్లాలి.
♦ ఎల్‌బీనగర్– ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాలి.
ప్రత్యేక పేపర్లతో టికెట్ల ముద్రణ
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డూప్లికేట్ టికెట్ల దందాను నివారించేందుకు ప్రత్యేక పేపర్‌తో టికెట్లను ముద్రించినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
♦ వీఐపీలు గేట్ నంబర్–1,2,3,4 వద్ద పార్కింగ్ చేయవచ్చు. గేట్ నంబర్ 1 నుంచి 12 వరకు రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.
♦ కేవీ స్కూల్ నుంచి హెచ్‌పీ పెట్రోల్ బంక్ వరకు డీఎస్‌ఎల్ వద్ద శక్తి సోప్స్, చర్చి స్కూల్, ఇండస్ట్రియల్ లేన్‌లో పార్కింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎల్జీ గోడౌన్ నుంచి ఎన్‌ఎస్‌ఎల్ రోడ్డుకు ఇరువైపులా, జెన్‌ప్యాక్ట్ సర్వీస్ రోడ్డు, జెన్‌ప్యాక్ట్ ఇన్నెర్ పార్కింగ్, ఎన్‌జీఆర్‌ఐ గేట్ నెంబర్–1,2,3 వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకోవచ్చు.
♦ కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ దారి ద్వారా గేట్ నంబర్ 1, 2లకు వెళ్లాలి.
♦ ఎల్బీనగర్ నుంచి వచ్చేవారు కేవీ స్కూల్ నుంచి పెట్రోల్ బంక్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. రామంతాపూర్ నుండి వచ్చే వారు చర్చి స్కూల్ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేసి గేట్ నెంబర్–8 నుండి 11లకు వెళ్లాలి. చాదర్‌ఘాట్, కాచిగూడ నుంచి వచ్చే వారు ఇండస్ట్రియల్ లేన్ ఎల్జీ గోడౌన్ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేయాలి.
♦ వికలాంగులు తమ వాహనాలను పార్కు చేసుకున్న అనంతరం రామంతాపూర్ దారి గుండా స్టేడియంలోకి గేట్ నంబర్–3 నుంచి లోనికి వెళ్లవచ్చు.
♦ రాత్రి 12 గంటల వరకు మెట్రో రైల్, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment