
మరో వివాదంలో ఉమర్ అక్మల్
వివాహ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘన
కేసు నమోదు చేసిన పోలీసులు
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం రాత్రి వివాహం చేసుకున్న ఉమర్... ఆ వేడుకల్లో నిబంధనల్ని ఉల్లంఘించాడన్న ఆరోపణపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ వేడుకలు రాత్రి 10 గంటలకే ముగించాలన్న నిబంధన అమల్లో ఉండగా, ఉమర్ వివాహానికి సంబంధించి విందును 10 గంటల తరువాత కూడా కొనసాగించారు. పైగా విందులో ఒక్క వంటకాన్ని మాత్రమే వడ్డించాల్సివుండగా, పలు రకాల వంటకాలు వడ్డించారు.
అంతేగాకుండా లాహోర్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, స్థానిక అధికారులపై ఉమర్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేశారు. అయితే ఉమర్ మాత్రం భార్యతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలోనూ ఉమర్.. ట్రాఫిక్ పోలీసుతో గొడవపడి అరెస్టు కావడం, బెయిలుపై విడుదలై టి20 ప్రపంచకప్‌లో ఆడడం తెలిసిందే.