
సెంచరీ కొట్టాడు.. జట్టులోకొచ్చాడు!
కరాచీ:
వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ ప్రస్తుత ఫాం బాగున్న కారణంగా మళ్లీ పాకిస్తాన్ టీ20 జట్టులోకి తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ చెప్పాడు. దేశవాలీ టీ20 చాంపియన్ షిప్లో విశేషంగా రాణిస్తున్న అక్మల్ త్వరలో పాక్-వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. దేశవాలీ మ్యాచ్ లలో ఫాంలోకి వచ్చాడని అతడ్ని జట్టులోకి తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు సూచన మేరకు సెలక్షన్ ప్యానెల్ అక్మల్ కు అవకాశం ఇచ్చింది. ఐదు నెలలు జాతీయ జట్టుకు దూరంగా ఉండటం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. వివాదాలు లేకుండా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అక్మల్ చెప్పాడు.
జట్టులో పర్మినెంట్ ఆటగాడు అవ్వడానికి తగిన ప్రదర్శన చేస్తానని తనతో చెప్పాడని ఇంజీ వెల్లడించాడు. మరోవైపు ఫాంలేని కారణంగా షాహిద్ అఫ్రిది, ఓపెనర్ హెహజాద్ అహ్మద్ లను సెలెక్ట్ చేయలేదన్నాడు. వారి ఫిట్ నెస్ పై కూడా విశ్వాసం లేదన్నాడు. టీ20 సిరీస్ ప్రదర్శనతో వన్డే జట్టులోనూ స్థానం దక్కించుకుంటానని అక్మల్ ధీమా వ్యక్తంచేశాడు. మరోవైపు లాహోర్ వైట్స్ తరఫున ఆడిన ఉమర్ అక్మల్ 48 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్ గా నిలవడమే అతడి పునరాగమనానికి కారణమని మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వివరించాడు.