మన ‘నరైన్‌’ | Under 16 Cricketer Naveen Special Story | Sakshi
Sakshi News home page

మన ‘నరైన్‌’

Published Sat, Sep 8 2018 1:29 PM | Last Updated on Sat, Sep 8 2018 1:29 PM

Under 16 Cricketer Naveen Special Story - Sakshi

బౌలింగ్‌ చేస్తున్న నవీన్‌

ఒంగోలు టౌన్‌: వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌ చేస్తే క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సింపుల్‌గా బౌలింగ్‌ చేస్తాడు. క్రీజ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ ఉన్నప్పటికీ తన స్పిన్‌ మాయాజాలంతో బోల్తా కొట్టిస్తాడు. చివరకు మ్యాచ్‌ రూపురేఖలనే మార్చేస్తాడు. పొట్టి ఫార్మాట్‌ అయిన టీ–20లో అయితే నరైన్‌ బాల్‌తో చేసే మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. నాలుగు ఓవర్లతో తాను ప్రాతినిధ్యం వహించే జట్టువైపు మ్యాచ్‌ తిరిగేలా చేస్తాడు. సునీల్‌ నరైన్‌ లాంటి బౌలర్‌ మన దగ్గరా ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ప్రకాశం జట్టు బరిలోకి దిగితే ఆ బౌలర్‌ తప్పకుండా ఉండాల్సిందే. ప్రత్యర్థి జట్టులో భీకరమైన ఫామ్‌ కొనసాగించే బ్యాట్స్‌మన్‌ ఉన్నా ఆ బౌలర్‌ కూల్‌గా బోల్తా కొట్టించి మ్యాచ్‌ను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జట్టు వైపు తిప్పుతూ ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ దృష్టిలో పడ్డాడు. అతనే పాశం నవీన్‌.

స్టేట్‌ ప్రాబబుల్స్‌కు ఎంపిక
ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్‌–16 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా తరఫున ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీశాడంటే నవీన్‌ బౌలింగ్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జట్టు లీగ్‌ స్థాయి నుంచి ఫైనల్స్‌కు చేరడంలో నవీన్‌ కీలకంగా వ్యవహరించాడు. నెల్లూరుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభంలో దురదృష్టవశాత్తు నవీన్‌ గాయపడి మ్యాచ్‌కు దూరమవడంతో అతని విలువేమిటో జట్టు మొత్తానికి తెలిసొచ్చింది. ఫైనల్స్‌లో నవీన్‌ బరిలోకి దిగకపోవడం, నెల్లూరు జట్టు దూకుడుకు పగ్గాలు వేసే బౌలర్‌ లేకపోవడంతో ప్రకాశం జట్టు రన్నరప్‌తో సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో నవీన్‌ ఆడి ఉంటే ప్రకాశం జట్టు విజయం సాధించి ఉండేదని జిల్లాకు చెందిన సీనియర్‌ క్రికెటర్లు వ్యాఖ్యానించడం చూస్తే ఆ బౌలర్‌ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

నేపథ్యం
లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన నవీన్‌ బౌలింగ్‌కు దిగితే అతని ఖాతాలో వికెట్లు పడాల్సిందే. అంతగా తన బౌలింగ్‌ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. ఒంగోలుకు చెందిన నవీన్‌ తండ్రి పాశం సుదర్శన్‌ ఇరిగేషన్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి అనూరాధ గృహిణి. స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ విజయనగరంలోని చింతలవలసలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పటి వరకు గల్లీ క్రికెట్‌ ఆడుతూ వచ్చిన నవీన్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ క్రికెటర్ల దృష్టిలో పడ్డాడు.

బరిలోకి దిగితే వికెట్లు పడాల్సిందే..
2014 నుంచి ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టీఎస్‌ ప్రసాద్, కె.సుధాకర్, బి.చంద్రశేఖర్‌ కోచింగ్‌లో రోజురోజుకూ రాటుదేలుతూ 2015లో ప్రకాశం అండర్‌–14 జట్టుకు ఎంపికయ్యాడు. 2016లో జరిగిన అంతర్‌ జిల్లాల మ్యాచ్‌లో చిత్తూరుపై ఏడు వికెట్లు, తూర్పుగోదావరిపై మూడు వికెట్లు, విశాఖపట్నంపై మూడు వికెట్లు తీసిన నవీన్‌ అండర్‌–14 రాష్ట్ర ప్రాబబుల్స్‌ జట్టులో స్థానం సంపాదించాడు. 2017లో జరిగిన అండర్‌–16 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీల్లో అనంతపురంపై ఎనిమిది వికెట్లు, కర్నూలు జట్టుపై పదకొండు వికెట్లు, కడప జట్టుపై 11 వికెట్లు, గుంటూరు జిల్లాపై ఏడు వికెట్లు తీశాడు. మొత్తం 38 వికెట్లు తీసిన నవీన్‌ అండర్‌–16 స్టేట్‌ ప్రాబబుల్స్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల నిర్వహించిన అండర్‌–16 ప్లేట్‌ గ్రూప్‌ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ మ్యాచ్‌లో శ్రీకాకుళంపై మూడు వికెట్లు, గుంటూరుపై ఎనిమిది వికెట్లు, నెల్లూరుపై రెండు వికెట్లు, పశ్చిమ గోదావరిపై తొమ్మిది వికెట్లు, విజయనగరంపై ఏడు వికెట్లు తీశాడు. విశాఖతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. తన ప్రతిభను గుర్తించిన కోచ్‌లు, సహకరించిన క్రికెట్‌ ప్రకాశం కార్యదర్శి చింతపల్లి ప్రతాప్‌కుమార్‌కు నవీన్‌ కృతజ్ఞతలు తెలిపాడు.
భారత జట్టు ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌తో..

క్రికెటే నా ఊపిరి
క్రికెట్‌ అంటే నాకు ప్రాణం. ముందుగా రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాలి. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, టీ–20 మ్యాచ్‌లు ఆడాలని ఉంది. మంచి ప్రతిభ కనబరచి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం.        – నవీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement