వివాదంలో అండర్-19 కెప్టెన్ కిషన్
ఆటో రిక్షాను ఢీకొట్టిన క్రికెటర్ కారు
పాట్నా: భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ వివాదంలో ఇరుక్కున్నాడు. మంగళవారం సాయంత్రం కంకర్‌బాగ్‌లో తాను ప్రయాణిస్తున్న కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టడంతో వివాదం చోటు చేసుకుంది. సంఘటన తర్వాత తండ్రి ప్రణబ్ పాండేతో కలిసి గొడవకు దిగడంతో పోలీసులు క్రికెటర్‌ను అరెస్ట్ చేశారని కథనాలు వచ్చాయి.
అయితే కంకర్‌బాగ్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ విజయ్ కుమార్ మిశ్రా ఈ కథనాలను ఖండించారు. యాక్సిడెంట్ జరిగింది వాస్తవమే అయినా.. ఇరువర్గాలు సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకున్నాయని తెలిపారు. ‘ఎలాంటి అరెస్టులుగానీ, ఎఫ్‌ఐఆర్‌లుగానీ లేవు. ఇరువర్గాలు స్టేషన్ బయటే ఓ అవగాహనకు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కిషన్ తండ్రి ప్రణబ్ వాహనాన్ని నడుపుతున్నారు. రిక్షాలో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి’ అని మిశ్రా వివరించారు. మరోవైపు యాక్సిడెంట్ గురించి ఆందోళన లేదని, క్రికెటర్ యథావిధిగా తన ప్రాక్టీస్‌కు వెళ్లిపోయాడని బిహార్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నీరజ్ సింగ్ వెల్లడించారు.