అండర్–19 భారత క్రికెట్ జట్టు సభ్యుడు తిలక్‌వర్మను సత్కరిస్తున్న గ్రామ ప్రముఖులు
పశ్చిమగోదావరి, ఉండి: టీమిండియాలో స్థానమే తన లక్ష్యమని అండర్–19 భారత క్రికెట్ జట్టు సభ్యుడు నంబూరి ఠాగూర్ తిలక్‌వర్మ అన్నారు. మండలంలోని వాండ్రం గ్రామానికి తన తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్‌వర్మతో కలసి శుక్రవారం వచ్చిన సందర్భంగా గ్రామ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు తిలక్‌వర్మను సాదరంగా సత్కరించారు. ఆయనతో కలసి ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం గ్రామానికి చెందిన అమ్మమ్మ భూపతిరాజు సుందరమ్మ, తాతయ్య సుబ్బరాజును ఆత్మీయంగా హత్తుకుని వారి దీవెనలు తీసుకున్నారు. అనంతరం తిలక్‌వర్మ మాట్లాడుతూ తాను 10 ఏళ్ల క్రితం అమ్మమ్మ గ్రామం వాండ్రం వచ్చినట్లు తెలిపారు. మళ్లీ ఇంత కాలానికి అమ్మమ్మ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మమ్మ, తాతయ్యలను చూసేందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో తనను సత్కరించిన గ్రామ ప్రముఖులు, పెద్దలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఫైనల్‌లో ఓటమి బాధించింది
దక్షిణాఫ్రికాలో ఈ నెల 9న జరిగిన అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత జట్టు ఓటమి తనను చాలా బాధించిందని అన్నారు. మరికొంత మెరుగ్గా ఆడితే బాగుండేదని అనిపించిందన్నారు. భవిష్యత్‌లో భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదగాలనేదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని అన్నారు. తనకు హైదరాబాద్‌లో మంచి శిక్షణ లభించిందని, బ్యాట్స్‌మెన్‌గా తాను మరింతగా రాణించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. తన తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్‌వర్మ ప్రోత్సాహంతోనే తాను ఇంతటి వాడిని అయ్యానని అన్నారు. తాను సాధించింది చాలా తక్కువని, భవిష్యత్‌లో సాధించాల్సింది చాలా ఉందన్నారు. తన ఆటను మెరుగుపరుచుకునేందుకు సీనియర్లు, క్రీడా ప్రముఖులు, రిటైర్డ్ ప్లేయర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తిలక్‌వర్మ తెలిపారు.
తిలక్‌వర్మతో తల్లిదండ్రులు నంబూరి నాగరాజు, గాయత్రీదేవి, సోదరుడు తరుణ్‌వర్మ
మావుళ్లమ్మ దర్శనం
అనంతరం గ్రామంలోని శివాలయంలో తిలక్‌వర్మ పూజలు నిర్వహించారు. అనంతరం భీమవరంలోని మావుళ్లమ్మ, జంగారెడ్డిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి దర్శనార్ధం తిలక్‌వర్మ తన కుటుంబసభ్యులతో పయనమై వెళ్లారు. గ్రామ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ దాసరి కృష్ణ, మాజీ సర్పంచ్ గడి గోవిందరావు, కందుల బలరామకృష్ణ, రెడ్డిపల్లి సత్యనారాయణ, గులిపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment