
ఢిల్లీ: ఇండియన్ ప‍్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్‌ను భారీ అంచనాల మధ్య ఆరంభించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను వరుస పరాజయాలు కలవరపరుస్తున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు ఓటముల్ని చవిచూడటం ఆ జట్టు సమష్టి వైఫల్యానికి అద్దం పడుతోంది. అందులో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలను గౌతం గంభీర్ వదులుకున్నాడు కూడా. జట్టును గాడిలో పెట్టాలనే ఆలోచనతో తన ఆటపై పూర్తి దృష్టి సారించలేకపోతున్నందుకే సారథ్య బాధ్యతల్ని నుంచి తప్పుకుంటున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. దాంతో గంభీర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. మరి శ్రేయస్ అయ‍్యర్ రాకతో ఢిల్లీ రాత మారుతుందా అనేది చూడాలి. శుక్రవారం సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరాట పడుతోంది. అదే క్రమంలో గాడిలో పడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది.
ఇప్పటికే మూడు జట్లు పదేసి పాయింట్లతో ప్లే ఆఫ్‌కు దగ్గరవుతుండగా.. ఢిల్లీ మాత్రం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక నుంచి ఢిల్లీ ఆడే ప‍్రతీ మ్యాచ్‌లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. బ్యాటింగ్‌లో జాసన్ రాయ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. హిట్టర్లు మాక్స్‌వెల్.. ఓపెనర్ గంభీర్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఫామ్‌లేమీతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించాలంటే సమష్టి ప‍్రదర్శన అవసరం. మరొకవైపు దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment