క్రీడల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: విశ్వ విద్యాలయాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని న్యూఢిల్లీకి చెందిన జాతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యా, క్రీడల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని చెప్పారు. దేశంలోని 600 విశ్వవిద్యాలయాల్లో యూజీసీ ఇచ్చే నిధుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఓయూ క్రీడాకారులకు గురుకుల శిక్షణ శిబిరాల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ క్రీడా వసతి గృహం దోహదపడుతుందని ఆయన తెలిపారు. యూజీసీ ఇచ్చిన రూ. రెండు కోట్లతోపాటు ఓయూ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ మరో కోటి రూపాయలు వెచ్చించి ఈ భవనం పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ హాస్టల్‌లో దాదాపు వంద మంది క్రీడాకారులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వెంకట్‌రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.