మరోసారి దుమ్ము రేపిన బోల్ట్
బీజింగ్: గత ఏడేళ్లుగా 100 మీటర్ల పరుగులో ఓటమి ఎరుగని జమైకా విఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్డ్ మరోసారి సత్తా చాటాడు. ఇక్కడ ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్ 100 మీటర్ల ఫైనల్ పోరులో బోల్ట్ విజేతగా నిలిచాడు. ఆదిలో బోల్ట్ తన పరుగును నెమ్మదిగా ఆరంభించినా.. చివరకు లక్ష్యాన్ని 9.79 సెకన్లలో చేరుకుని స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.
ఫైనల్లో ఉసేన్ బోల్ట్- జస్టిన్ గాట్లిన్ ల మధ్య పోరు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పింది. తొలి 15 మీటర్ల వరకూ వెనుకబడ్డ బోల్ట్.. ఒక్కసారిగా వేగాన్ని పెంచాడు. దీంతో అప్పటివరకూ ముందంజలో ఉన్న గాట్లిన్ వెనుకబడ్డాడు. ఇక అదే దూకుడును చివరి వరకూ కొనసాగించిన బోల్ట్ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే ఒక సెకను వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్న అమెరికా రన్నర్ గ్లాటిన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోల్ట్ ను ఓడించే సువర్ణావకాశం వచ్చినా.. దాన్ని గ్లాటిన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4/ 100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు సాధించాడు.