భళా... బోల్ట్
మూడోసారి 100 మీటర్ల ప్రపంచ టైటిల్ కైవసం
9.79 సెకన్లలో గమ్యానికి గట్టిపోటీనిచ్చిన గాట్లిన్
బీజింగ్: గత ఏడేళ్లుగా తాను బరిలోకి దిగిన 100 మీటర్ల రేసులో పరాజయమెరుగని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మళ్లీ మెరిశాడు. తన అజేయ రికార్డును కొనసాగిస్తూ మూడోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి బర్డ్స్‌నెస్ట్ స్టేడియంలో జరిగిన పురుషుల 100 మీటర్ల రేసులో బోల్ట్ విజేతగా నిలిచాడు. 9.79 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు గత 28 రేసుల్లో ఓటమి ఎరుగని జస్టిన్ గాట్లిన్ (అమెరికా)ను ఓడించాడు. గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి నిషేధం ఎదుర్కొన్న జస్టిన్ గాట్లిన్ (9.80 సెకన్లు) ఎంత వేగంగా పరిగెత్తినా బోల్ట్ ధాటికి చివరకు సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 50 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న బోల్ట్ ఆ తర్వాత వేగం పెంచి చివరి 10 మీటర్లలో గాట్లిన్‌ను అధిగమించాడు. ట్రెవన్ బ్రోమెల్ (అమెరికా-9.92 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో బోల్ట్‌కిది మూడో స్వర్ణ పతకం. గతంలో అతను 2009, 2013లలో కూడా పసిడి పతకాలు సాధించాడు. ఇదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో కూడా బరిలోకి దిగనున్నాడు.
ఇందర్జీత్‌కు 11వ స్థానం
మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఇందర్జీత్ సింగ్ ఫైనల్‌కు చేరుకున్నా ఆఖరకు 11వ స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఆసియా చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇందర్జీత్ సింగ్ ఇనుప గుండును 19.52 మీటర్ల దూరం విసిరాడు. జో కొవాక్స్ (అమెరికా-21.93 మీటర్లు) స్వర్ణం సాధించగా... డేవిడ్ స్ట్రోల్ (జర్మనీ-21.74 మీటర్లు), రిచర్డ్స్ (జమైకా-21.69 మీటర్లు) రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో భారత్‌కు చెందిన బల్జీందర్ సింగ్ రేసును కూడా పూర్తి చేయలేకపోగా... గుర్మీత్ సింగ్ 35వ, చందన్ సింగ్ 41వ స్థానాల్లో నిలిచారు.