ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
‘లండన్’ రేస్‌కు బోల్ట్ రెడీ
లండన్: జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ట్రాక్‌లో అతని వేగం అందుకోలేరెవరు. ఈ మల్టీ ఒలింపిక్ చాంపియన్ పతకం రేసు ఇప్పుడు ఆఖరి మజిలీకి చేరుకుంది. లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత ఆ పరుగు ఇక చరిత్రే. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సంచలన స్ప్రింటర్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బోల్ట్ తల్లిదండ్రులు వెలెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ అతనికి అందజేశారు. ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి.
ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. శనివారం రాత్రి ఈ బూట్లతోనే బోల్ట్ ఆఖరి పరుగు పెడతాడు. ఆల్ ది బెస్ట్... లెజెండ్!