జమైకా స్టార్‌కే 100 మీటర్ల టైటిల్ | Usain Bolt regains 100m title at World Athletics in emphatic style | Sakshi
Sakshi News home page

జమైకా స్టార్‌కే 100 మీటర్ల టైటిల్

Published Mon, Aug 12 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

జమైకా స్టార్‌కే 100 మీటర్ల టైటిల్

జమైకా స్టార్‌కే 100 మీటర్ల టైటిల్

ఆరడుగుల బుల్లెట్ మళ్లీ దూసుకెళ్లింది. వేగం తన నైజమని... విజయం తన చిరునామానని చాటింది. దీంతో మాస్కోలో ఎవరూ కాస్కోలేకపోయారు... స్ప్రింట్‌లో వండర్ మ్యాన్ తానేనని థండర్ బోల్ట్ నిరూపించాడు. గాలినే మించే తనను ప్రత్యర్థులెవరూ మీటలేరని మరోసారి నిజం చేశాడు.
 
 మాస్కో (రష్యా): రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎదురైన చేదు అనుభవానికి ఉసేన్ బోల్ట్ ఈసారి పసిడి పతకంతో లెక్క సరిచేశాడు. 100 మీటర్ల రేసులో మరోసారి విశ్వవిజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన స్ప్రింట్ ఫైనల్లో ఈ ఒలింపిక్ చాంపియన్ 9.77 సెకన్లలో లక్ష్యానికి చేరుకున్నాడు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా-9.85 సెకన్లు) రజతం... నెస్టా కార్టర్ (జమైకా-9.95 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు.
 
 2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 9.58 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘ఫాల్స్ స్టార్ట్’ చేసి అనర్హత వేటుకు గురయ్యాడు. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా రేసును పూర్తి చేసి తన ఖాతాలో రెండోసారి 100 మీటర్ల ప్రపంచ పసిడి పతకాన్ని జమచేసుకున్నాడు. తనకు గట్టిపోటీనిస్తారనుకున్న స్టార్ అథ్లెట్స్ యోహన్ బ్లేక్ (జమైకా), అసఫా పావెల్ (జమైకా), టైసన్ గే (అమెరికా) వివిధ కారణాలతో ఈ పోటీలకు దూరమవ్వడంతో బోల్ట్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండాపోయింది.
 
 తుపాకీలో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌లా రేసును ఆరంభించిన ఈ జమైకా స్టార్ అదే వేగంతో పోటీని పూర్తి చేశాడు. తొలి 60 మీటర్ల వరకు 2004 ఒలింపిక్ చాంపియన్ గాట్లిన్ నుంచి గట్టిపోటీ లభించినా... మిగిలిన 40 మీటర్లలో బోల్ట్ తన శక్తినంతా కూడదీసుకొని పరిగెత్తి తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు. కిమర్ బెయిలీ కోల్ (జమైకా-9.98 సెకన్లు), నికెల్ యాష్‌మెడ్ (జమైకా-9.98 సెకన్లు), మైక్ రోడ్జర్స్ (అమెరికా-10.04 సెకన్లు), క్రిస్టోఫ్ లెమైట్రె (ఫ్రాన్స్-10.06 సెకన్లు), జేమ్స్ డసలూ (బ్రిటన్-10.21 సెకన్లు) వరుసగా నాలుగు నుంచి ఎనిమిది స్థానాలను సంపాదించారు.
 
 రష్యాకు తొలి స్వర్ణం
 పోటీల రెండో రోజూ రష్యా పసిడి బోణీ చేసింది. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో అలెగ్జాండర్ ఇవనోవ్ (రష్యా) గంటా 20 నిమిషాల 58 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని సాధించాడు. చెన్ డింగ్ (చైనా-1గం:21ని:09 సెకన్లు) రజతం నెగ్గగా... లోపెజ్ (స్పెయిన్-1గం:21ని:21 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నాడు.
 
 దిబాబాకు మూడో పసిడి
 మహిళల 10 వేల మీటర్ల రేసులో ఒలింపిక్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా) మూడోసారి పసిడి పతకాన్ని నెగ్గింది. 2005, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణం నెగ్గిన దిబాబా ఈసారి రేసును 30 నిమిషాల 43.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. మహిళల డిస్కస్ త్రోలో పెర్కోవిక్ (క్రొయేషియా-67.99 మీటర్లు) స్వర్ణం సాధించగా... లాంగ్‌జంప్‌లో బ్రిట్నీ రీస్ (అమెరికా-7.01 మీటర్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది.
 
 ఎదురులేని ఈటన్
 పది అంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో అమెరికా అథ్లెట్ యాష్టన్ ఈటన్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన ఈటన్ ఈసారి పసిడి దక్కించుకున్నాడు. ఈటన్ మొత్తం 8809 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.  
 
 భారత్‌కు నిరాశ
 పురుషుల 20 కిలోమీటర్ల నడకలో భారత్ నుంచి ఇర్ఫాన్, గుర్మీత్ సింగ్, చందన్ సింగ్ పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల తర్వాత ఇర్ఫాన్ అనర్హత వేటుకు గురయ్యాడు. గుర్మీత్ 33వ ... చందన్ సింగ్ 34వ స్థానంలో నిలిచారు.
 
 3
 కార్ల్‌లూయిస్, మౌరిస్ గ్రీన్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్ప్రింట్ టైటిల్‌ను రెండు సార్లు నెగ్గిన మూడో అథ్లెట్ బోల్ట్
 
 సంతోషమే కానీ...
 ‘టైటిల్ గెలవడం ఆనందమే కానీ... నేనింకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను. సెమీఫైనల్స్ తర్వాత నా కాళ్లు కాస్త నొప్పి చేశాయి. ఉన్నట్లుండి ఎందుకిలా జరిగిందో తెలియదు. దీంతో రికార్డుల సంగతి మరచి విజయంపైనే దృష్టి సారించాను. ఎందుకంటే మా వాళ్ల (జమైకా) ఆశలు... అంచనాలు నాపైనే. నేనేప్పుడూ ఆధిపత్యం చాటాలనే వారు కోరుకుంటారు’
 -ఉసేన్ బోల్ట్
 
 6
 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో బోల్ట్ సాధించిన స్వర్ణాల సంఖ్య
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement