
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ హత్యకు నిజాముదీన్ అనే వ్యక్తి కుట్రపన్నాడని అసత్య ఆరోపణలు చేసిన ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ఒక యువతితో ప్రేమకు సంబంధించిన విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతోనే అర్సలాన్ ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో అర్సలాన్ కొన్ని రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యాడు. బయటికి వచ్చిన నాటినుంచి కేసును నీరుగార్చేందుకు... సాక్షిని ప్రభావితం చేస్తున్నాడనే అరోపణలతో గురువారం పోలీసులు అతడిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
కాగా శ్రీలంకకు చెందిన నిజాముదీన్ అనే వ్యక్తి మాజీ ప్రధానిని హత్య చేసేందుకు ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేశాడని పోలీసులను నమ్మించిన అర్సలాన్ అతడిని అరెస్టు చేయించాడు. అయితే విచారణలో భాగంగా నిజాముదీన్‌కు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని తేలడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అంతేకాకుండా తప్పుడు ఆరోపణలతో ఓ అమాయకుడిని కేసులో ఇరికించాలని ప్రయత్నించిన అర్సలాన్‌ను అరెస్టు చేయడంతో పాటు.. నిజాముదీన్ కోర్టు ఖర్చులను కూడా పోలీసులే భరించడం విశేషం. ఇక ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment