ఆరోన్, కరణ్... సూపర్
సీఏ ఎలెవన్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
తొలి ఇన్నింగ్స్‌లో 243 ఆలౌట్
భారత్ 99/2 రెండో ప్రాక్టీస్ మ్యాచ్
అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. వరుసగా రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. వరుణ్ ఆరోన్ (4/41), కరణ్ శర్మ (3/57)లు విజృంభించడంతో గురువారం ప్రారంభమైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.
సిల్క్ (58), గోట్చ్ (58 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. విజయ్ (39 బ్యాటింగ్), కోహ్లి (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ధావన్ (0), పుజారా (22) విఫలమయ్యారు. విజయ్, కోహ్లిలు మూడో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించారు.
గ్లైడరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... చెరో 100 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు ఇరుజట్లు అంగీకరించడంతో టాస్ లేకుండానే భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సీఏ జట్టుకు ఆరంభంలో షమీ, ఆరోన్ కొత్త బంతితో చుక్కలు చూపించారు. కార్టర్స్ (1), టర్నర్ (0), షార్ట్ (19)లను అవుట్ చేయడంతో సీఏ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిల్క్, కీత్ (19)లు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు.
అయితే సిల్క్ అవుటైన తర్వాత స్పిన్నర్ కరణ్ శర్మ తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. అయితే ఓ ఎండ్‌లో గోట్చ్ పట్టు వదలకుండా పోరాడటంతో ఓ దశలో 159/7 స్కోరుతో ఉన్న సీఏ ఇన్నింగ్స్ కాస్త కోలుకుంది. లాలర్ (21), ప్యాటిసన్ (16), రెయిన్‌బర్డ్ (4)లో కలిసి గోట్చ్ మొత్తం 84 పరుగులు జోడించాడు. షమీ 2, జడేజా ఒక్క వికెట్ తీశాడు.
స్కోరు వివరాలు
క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 243.
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 39; ధావన్ (సి) ప్యాటిసన్ (బి) లాలర్ 0; పుజారా (సి) టర్నర్ (బి) లాలర్ 22; కోహ్లి బ్యాటింగ్ 30; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం(29 ఓవర్లలో 2 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1-1; 2-36
బౌలింగ్: రెయిన్‌బర్డ్ 10-1-41-0; లాలర్ 8-2-18-2; గుల్బిస్ 5-2-10-0; మూడీ 6-1-27-0.
హ్యూస్ మృతికి సంతాపంగా ఇరుజట్లు మ్యాచ్‌కు ముందు ఒక నిమిషంపాటు మౌనం పాటించాయి. భారత ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి మ్యాచ్ ఆడారు. తమ బ్యాట్‌ల మీద టోపీలు పెట్టి మైదానంలో ఉంచారు. స్కోరు బోర్డుపై ‘ఆర్‌ఐపీ’ హ్యూస్ 408 అని రాశారు.