వసంత్ రాయ్‌జీ
సాక్షి, ముంబై: ప్రముఖ భారత మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ (100) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్ లోని తన నివాసంలో నిద్రలో ఈ తెల్లవారుజామున 2.20 గంటలకు రాయ్‌జీ కన్నుమూశారని ఆయన అల్లుడు సుదర్శన్ నానావతి తెలిపారు.
1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన రాయ్‌జీ 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరపున అరంగేట్రం చేశారు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన ఆయన 1949-50 వరకు బరోడా, ముంబై జట్టుకు సేవలందించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆయన విశేష సేవలందించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం క్రికెట్‌పై అనేక రచనలు చేసి క్రికెట్ చర్రితకారుడుగా పేరు గడించారు. భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరుగా అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ ఇటీవల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా కేక్ కట్ చేయించి వేడుక చేసిన సంగతి తెలిసిందే. (‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’)
Comments
Please login to add a commentAdd a comment