
అక్కా చెల్లెళ్ల హవా
యువ తారల దూకుడుకు దీటైన సమాధానమిస్తూ మూడు పదుల వయసు దాటినా తమలో వన్నె తగ్గలేదని ‘అమెరికా నల్లకలువలు’ వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తమ జోరును ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్లుగా చెల్లెలు సెరెనా నిలకడగా ఆడుతోన్నా... గాయాల కారణంగా కొంతకాలంగా వెనుకబడి పోయిన అక్క వీనస్ తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దాంతో నాలుగేళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరూ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నారు.
మెల్‌బోర్న్: క్లిష్ట సమయంలో అనుభవం అక్కరకు వస్తుందని అమెరికా టెన్నిస్ స్టార్ సిస్టర్స్ వీనస్, సెరెనా విలియమ్స్ నిరూపించారు. యువ క్రీడాకారిణుల నుంచి గట్టిపోటీ లభిస్తున్నా... తమ అనుభవాన్నంతా రంగరించి ఈ ఇద్దరూ స్ఫూర్తిదాయక విజయాలు సాధిస్తున్నారు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా, వీనస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, 33 ఏళ్ల సెరెనా 2-6, 6-3, 6-2తో 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలుపొందగా... 34 ఏళ్ల వీనస్ 6-2, 2-6, 6-1తో ఆరో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)ను బోల్తా కొట్టించింది. ఫలితంగా 2010 తర్వాత వీనస్, సెరెనాలిద్దరూ కలిసి మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
చివరిసారి 2010లో సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గగా... అదే టోర్నీలో వీనస్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. అదే ఏడాదిలో సెరెనా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించి, వింబుల్డన్ టోర్నీ టైటిల్ సాధించింది. వీనస్ మాత్రం ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్, వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో, యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2010 తర్వాత వీనస్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. మరోవైపు సెరెనా మాత్రం గత నాలుగేళ్లలో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా)తో సెరెనా; మాడిసన్ కీస్ (అమెరికా)తో వీనస్ తలపడతారు. క్వార్టర్స్‌లో నెగ్గితే ఈ అక్కా చెల్లెళ్లు సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ సిబుల్కోవా 6-2, 3-6, 6-3తో రెండుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై నెగ్గగా... అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ 6-2, 6-4తో మాడిసన్ బ్రెంగెల్ (అమెరికా)ను ఓడించింది.
లెక్క సరిచేసింది....
గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే తనను ఇంటిదారి పట్టించిన ముగురుజాపై సెరెనా ప్రతీకారం తీర్చుకుంది. తొలి సెట్‌ను నెగ్గిన 21 ఏళ్ల మురుగుజా మరోసారి సంచలనం సృష్టిస్తుందేమోనని అనుకున్నారు. కానీ సెరెనా అలా జరగనివ్వలేదు. ఏకాగ్రతతో ఆడుతూ మురుగుజా దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ సెట్‌ను 6-3తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోనూ ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. సరిగ్గా 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 17 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
మళ్లీ ఫామ్‌లోకి...
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వీనస్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఆరో సీడ్ రద్వాన్‌స్కాతో 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆటతీరును చూశాక పాత వీనస్ గుర్తుకొచ్చింది. సుదీర్ఘ ర్యాలీలు, కచ్చితమైన సర్వీస్‌లతో అలరించిన వీనస్ మూడు సెట్‌లలో ఆత్మ విశ్వాసం పెంచే విజయాన్ని అందుకుంది.
తొలి సెట్‌లో ఏకంగా 15 నిమిషాలపాటు జరిగిన ఏడో గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వీనస్ అదే జోరులో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో తడబడినప్పటికీ... మూడో సెట్‌లో వీనస్ మళ్లీ విజృంభించి రద్వాన్‌స్కా ఆటను కట్టించింది. కష్టకాలంలోనూ విశ్వాసం కోల్పోకుండా ఉన్నానంటే తన సోదరి సెరెనాయే కారణమని, ఆమెనే ఆదర్శంగా తీసుకుంటున్నానని మ్యాచ్ తర్వాత వీనస్ వ్యాఖ్యానించింది.
క్వార్టర్స్‌లో జొకోవిచ్
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)లతోపాటు ఐదో సీడ్ నిషికోరి (జపాన్), ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-4, 7-5, 7-5తో ముల్లర్ (లక్సెంబర్గ్)పై, నిషికోరి 6-3, 6-3, 6-3తో ఫెరర్ (స్పెయిన్)పై గెలి చారు. నాలుగో సీడ్ వావ్రింకా 7-6 (7/2), 6-4, 4-6, 7-6 (10/8) తో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై, రావ్‌నిచ్ 6-4, 4-6, 6-3, 6-7 (7/9), 6-3తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై కష్టపడి నెగ్గారు. క్వార్టర్‌లో రావ్‌నిచ్‌తో జొకోవిచ్; నిషికోరితో వావ్రింకా ఆడతారు.