ఆంధ్ర జట్టు, హైదరాబాద్ జట్టు
సాక్షి, హైదరాబాద్: మరోసారి సమష్టి ఆటతీరుతో అదరగొట్టిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది 24 పాయింట్లతో ‘టాపర్’గా నిలువడం విశేషం. గ్రూప్ ‘డి’లో హైదరాబాద్ ఐదు విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది.
భరత్, విహారి సెంచరీలు
చెన్నైలో ముంబై జట్టుతో జరిగిన చివరిదైన ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగులతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 344 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (126 బంతుల్లో 106; 10 ఫోర్లు)... కెప్టెన్ గాదె హనుమ విహారి (118 బంతుల్లో 169; 16 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో ముంబై బౌలర్ల భరతం పట్టారు. ఈ టోర్నీలో భరత్‌కిది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. భరత్, విహారి రెండో వికెట్‌కు 254 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక చివర్లో రికీ భుయ్ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీలతో చెలరేగి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్దేశ్ లాడ్ (98 బంతుల్లో 118; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (3/55), ఆశిష్ (2/51) రాణించారు.
మెరిసిన సందీప్, సిరాజ్
ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను బావనాక సందీప్ (95 బంతుల్లో 79; 4 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (65 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఆదుకున్నారు. రాయుడు అవుటయ్యాక టి.రవితేజ (35 బంతుల్లో 45; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి సందీప్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జతచేశాడు. చివర్లో ఆకాశ్ భండారి (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/37) హడలెత్తించాడు. సిరాజ్ ధాటికి ఛత్తీస్‌గడ్ 44.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ రెండు వికెట్లు తీయగా... రవికిరణ్, ఆకాశ్ భండారి, సందీప్‌లకు ఒక్కో వికెట్ లభించింది.
గ్రూప్ ‘ఎ’ నుంచి బరోడా, కర్ణాటక; గ్రూప్ ‘బి’ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర; గ్రూప్ ‘సి’ నుంచి ముంబై; గ్రూప్ ‘డి’ నుంచి సౌరాష్ట్ర క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మిగతా జట్లు. నాకౌట్ దశ మ్యాచ్‌లు ఈనెల 21 నుంచి 27 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతాయి. 21న రెండు క్వార్టర్ ఫైనల్స్... 22న మరో రెండు క్వార్టర్స్ ఫైనల్స్ నిర్వహిస్తారు. 24న, తొలి సెమీఫైనల్, 25న రెండో సెమీఫైనల్... 27న ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment