ఆంధ్ర జట్టు
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘సి’లో ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అజేయంగా క్వార్టర్స్ చేరిన ఆంధ్ర... గురువారం ఇక్కడ జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో పటిష్ట ఢిల్లీని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. కీలకమైన పోరులో ఆంధ్ర బౌలర్లు శివకుమార్ (4/29), భార్గవ్ భట్ (3/28) విజృంభించడంతో సంచలన విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్ర సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ జట్టు ఆంధ్ర బౌలర్ల ధాటికి నిలవలేక 32.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రికీ భుయ్ (36; 5 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (38; 4 ఫోర్లు) రాణించడంతో 28.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆంధ్ర, సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు.
ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్ (4), హితేన్ దలాల్ (11)లతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ (8)లను శివకుమార్ పెవిలియన్ పంపి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం నితీశ్ రాణా (2), ప్రదీప్ సాంగ్వాన్ (10) కూడా వారిని అనుసరించారు. రిషభ్ పంత్ (38; 2 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (21; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు స్కోరు వంద దాటింది. ఆంధ్ర బౌలర్లలో బండారు అయ్యప్ప 2, నరేన్‌రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం మరో 21.2 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచి ఆంధ్ర... దేశవాళీ క్రికెట్‌లో బంతులపరంగా ఢిల్లీకి అతి పెద్ద పరాజయాన్ని మిగిల్చింది. మరో క్వార్టర్ ఫైనల్లో బరోడాపై సౌరాష్ట్ర గెలుపొందింది. మొదట బరోడా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా... ఆ తర్వాత సౌరాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసి సెమీస్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment