Vijay Hazare tournament
-
Vijay Hazare Trophy: వన్డేల్లో కుర్రాళ్ల సత్తాకు పరీక్ష
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో టి20 సమరం ముగిసిన తర్వాత ఇప్పుడు వన్డే పోరుకు రంగం సిద్ధమైంది. విజయ్‌హజారే వన్డే టోర్నీలో భాగంగా నేటినుంచి దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలు వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఉండగా...మున్ముందు వన్డే టీమ్‌లో స్థానం ఆశిస్తున్న ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇది సరైన అవకాశం కానుంది. ఈ ఆటగాళ్ల కారణంగా టోర్నీపై ఆసక్తి పెరగడంతో పాటు తీవ్రమైన పోటీ కారణంగా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం కూడా ఉంది. బరోడా తరఫున ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతున్నాడు. టి20లో ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు పేస్ బౌలర్లు వన్డే టీమ్‌లో తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అర్‡్షదీప్ సింగ్ (పంజాబ్), అవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), ఖలీల్ అహ్మద్ (రాజస్తాన్), ముకేశ్ కుమార్ (బెంగాల్), యశ్ దయాళ్ (యూపీ) తమ బౌలింగ్‌కు పదును పెడుతున్నారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి (తమిళనాడు), కుల్దీప్ యాదవ్ (యూపీ), రవి బిష్ణోయ్ (రాజస్తాన్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాటర్లలో అందరి దృష్టీ శ్రేయస్ అయ్యర్‌పై ఉంది. వన్డే టీమ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్న అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా టి20 మెరుపులను దాటి వన్డే టీమ్‌లో రెగ్యులర్‌గా మారే క్రమంలో ఈ టోర్నీ తగిన వేదిక కానుంది. భారత ఆటగాడు రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ కెపె్టన్‌గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. సీనియర్ స్థాయిలో అతను తొలిసారి సారథిగా వ్యవహరించనుండటం విశేషం. భారత ఆటగాడు, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెపె్టన్ అయిన సంజు సామ్సన్‌కు కేరళ జట్టులో చోటు లభించలేదు. తాము నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లనుంచే జట్టును ఎంపిక చేయాలని కేరళ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడంతో సామ్సన్ పేరును పరిశీలించనే లేదు. కర్నాటక టీమ్ కూడా సీనియర్ బ్యాటర్ మనీశ్ పాండేకు ఉద్వాసన పలికింది. ఇక కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కర్నాటక అసోసియేషన్ స్పష్టం చేసింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో కలిపి 117 పరుగులే చేసిన పాండే ప్రభావం చూపలేకపోయాడు. మరో వైపు ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించిన బెంగాల్ పేసర్, భారత సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీను వన్డే టీమ్‌లోకి కూడా తీసుకున్నారు.అయితే నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో మాత్రం షమీ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటాడని బెంగాల్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మరో మ్యాచ్‌లో త్రిపురతో బరోడా తలపడుతుంది. అహ్మదాబాద్‌లో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నాగాలాండ్‌తో తిలక్ వర్మ సార«థ్యంలోని హైదరాబాద్ తలపడుతుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ముంబైలో జరిగే మ్యాచ్‌లో రైల్వేస్‌ను శ్రీకర్ భరత్ సార«థ్యంలోని ఆంధ్ర జట్టు ఎదుర్కొంటుంది. -
పృథ్వీ షా మెరుపులు
న్యూఢిల్లీ: తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబై జట్టు ఓపెనర్ పృథ్వీ షా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ సెంచరీతో (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్స్‌లు) కదంతొక్కాడు. దాంతో ముంబై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజా ప్రదర్శనతో లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా పృథ్వీ షా ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (183 నాటౌట్; శ్రీలంకపై 2005లో) పేరిట ఉండేది. తొలుత సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 పరుగులు చేసింది. సమర్థ్ వ్యాస్ (90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), చిరాగ్ జానీ (53 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 41.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 285 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న షా ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడికి యశస్వి జైస్వాల్ (104 బంతుల్లో 75; 10 ఫోర్లు, సిక్స్) తోడవ్వడంతో ముంబై ఛేదన సాఫీగా సాగింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 238 పరుగులు జోడించారు. అనంతరం జైస్వాల్ అవుటైనా క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారే (20 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి పృథ్వీ లాంఛనం పూర్తి చేశాడు. ఈ టోర్నీలో షాకిది మూడో సెంచరీ. మరో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీపై ఉత్తరప్రదేశ్ 46 పరుగుల ఆధిక్యంతో నెగ్గింది. తొలుత ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్ (112; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. కరణ్ శర్మ (83; 11 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఢిల్లీ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో గుజరాత్‌తో ఉత్తరప్రదేశ్; కర్ణాటకతో ముంబై తలపడతాయి. -
కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా
ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. -
ముంబై ఆశలపై వర్షం
ఆలూరు (బెంగళూరు): విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో ముంబై సెమీస్ చేరే అవకాశాన్ని వర్షం అడ్డుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై విజయం దిశగా సాగుతున్న దశలో వర్షం రావడం... వాన ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాకుండానే రద్దయింది. దాంతో నిబంధనల ప్రకారం లీగ్ దశలో ముంబై (4) కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఛత్తీస్‌గఢ్ (5)కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులతో ఉన్న సమయంలో వాన కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వీజేడీ పద్ధతి ద్వారా ముంబై లక్ష్యాన్ని 40 ఓవర్లలో 192 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ముంబై 11.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులతో ఉండగా... వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (38 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తమిళనాడు, పంజాబ్ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్స్ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే రద్దయింది. మొదట తమిళనాడు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 39 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. పంజాబ్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులతో ఉన్న సమయంలో వాన కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో లీగ్ దశలో పంజాబ్ (5) విజయాల కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన తమిళనాడు (9) సెమీస్ చేరింది. 23న జరిగే సెమీఫైనల్స్‌లో కర్ణాటకతో ఛత్తీస్‌గఢ్; గుజరాత్‌తో తమిళనాడు తలపడతాయి. -
గంభీర్ సెంచరీ సెమీస్‌లో ఢిల్లీ
బెంగళూరు: తన 37వ పుట్టిన రోజున అద్భుత సెంచరీతో అలరించిన గౌతమ్ గంభీర్ (72 బంతుల్లో 104; 16 ఫోర్లు)... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఢిల్లీ జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. హరియాణాతో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హరియాణా 49.1 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్ కుల్వంత్ ఖెజ్రోలియా (6/31) ‘హ్యాట్రిక్’ సహా ఆరు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కుల్వంత్ వరుస బంతుల్లో చైతన్య బిష్ణోయ్, ప్రమోద్ చండీలా, అమిత్ మిశ్రాలను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. గంభీర్ చెలరేగడంతో 230 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 39.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రతో హైదరాబాద్ తలపడనుంది. -
క్వార్టర్స్‌లో ఆంధ్ర
ఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ఆ జట్టు 7 వికెట్లతో గెలుపొందింది. దీంతో హైదరాబాద్ (22 పాయింట్లు)ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో ఈ జట్టు 8 మ్యాచ్‌లకు గాను 6 గెలిచి, ఒకదాంట్లో ఓడింది. మరోదాంట్లో ఫలితం తేలలేదు. టోర్నీలో తదుపరి దశకు వెళ్లాలంటే గెలుపు తప్పనిసరైన మ్యాచ్‌లో ఆంధ్ర సులువుగానే నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్... ఆఫ్ స్పిన్నర్లు షోయబ్ మొహమ్మద్ ఖాన్ (4/16), హనుమ విహారి (3/31)ధాటికి 41.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. ఆనంద్‌సింగ్ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు) మాత్రమే రాణించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒక దశలో 53/3తో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రికీ భుయ్ (74 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బి.సుమంత్ (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్)అజేయ ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. నాలుగో వికెట్‌కు వీరు 103 పరుగులు జోడించారు. దీంతో 34.3 ఓవర్లలోనే జట్టు లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా టెస్టు జట్టులో ఉన్న హనుమ విహారిని బీసీసీఐ రిలీవ్ చేయడంతో అతడు విజయ్ హజారే మ్యాచ్ ఆడాడు. -
కరణ్వీర్ కౌశల్ డబుల్ సెంచరీ
నదియాడ్ (గుజరాత్): పాతికేళ్ల దేశవాళీ వన్డే టోర్నీ చరిత్రలో తొలి ద్విశతకం నమోదైంది. ఉత్తరాఖండ్ ఓపెనర్ కరణ్వీర్ కౌశల్ (135 బంతుల్లో 202; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే వన్డే టోర్నీలో సిక్కింపై ఉత్తరాఖండ్ 199 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరణ్వీర్ అద్భుత ఇన్నింగ్స్‌తో గతంలో అజింక్య రహానే (187, 2007–08) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 366 పరుగుల భారీ స్కోరు చేసింది. కరణ్‌వీర్‌తో పాటు మరో ఓపెనర్ వినీత్ సక్సేనా (100; 4 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 296 పరుగులు జతచేశారు. భారత లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. గతంలో ఈ రికార్డు ధావన్–ఆకాశ్ చోప్రా (277 పరుగుల, 2007–08) పేరిట ఉంది. అనంతరం సిక్కిం 50 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. -
అదే... అతడికి అడ్డంకి!
ఈ దేశవాళీ సీజన్లో ఇప్పటికి 2141 పరుగులు... 30 ఇన్నింగ్స్‌లలో 8 శతకాలు... చివరి 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఐదు అర్ధ సెంచరీలు... మూడు సెంచరీలు... ఇవి ఒక జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ గణాంకాలు కాదు! కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే రికార్డులు! అయినా శ్రీలంకలో జరిగే టి20 ముక్కోణపు టోర్నీలో అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు! ఇంతకంటే ఇంకేం చేయాలి? మరి భారత జట్టులోకి ఎంపికకు మయాంక్ ఎంతవరకు అర్హుడు? ఇందుకు అడ్డంకిగా నిలుస్తున్న అంశాలేంటి? సాక్షి క్రీడా విభాగం: వాస్తవమే... మయాంక్ ప్రతిభావంతుడే. కర్ణాటకను ఈ సీజన్లో ఒంటిచేత్తో గెలిపించినవాడే. కరుణ్ నాయర్, లోకేశ్ రాహుల్ వంటివారున్న జట్టులో తన ఉనికిని బలంగా చాటుకున్నవాడే. అన్నిటికి మించి స్ట్రోక్ ప్లేలో డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించేవాడే. ఓ అవకాశం ఇచ్చి పరీక్షించదగినవాడే. అయినా... పిలుపెందుకు రాలేదు? దీనికి కారణాలు ఏమిటి? తనలో లోపం ఎక్కడుంది? సెలెక్షన్ కమిటీ ఆలోచన ఎలా ఉంది? అనే ప్రశ్నలు రావడం సహజం. వీటన్నిటికీ సమాధానం జాతీయ జట్టులోని పరిస్థితులు. దీంతోపాటు నిలకడ లేని అతడి గత ఆటతీరు. ఈ ఒక్క ప్రదర్శననే చూడలేరుగా! 13 మ్యాచ్‌ల్లో 284 పరుగులు, సగటు 23.66... గతేడాది రంజీల్లో మయాంక్ ప్రదర్శనిది. మూడే అర్ధ సెంచరీలు చేశాడు. అంతకుముందు (2015–16) సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 52.12 సగటుతో 417 పరుగులు సాధించాడు. ఈసారి మాత్రం ఒక ట్రిపుల్ సెంచరీ సహా నాలుగు శతకాలతో 1160 పరుగులు చేశాడు. అంటే మూడు సీజన్లలో అతడు భారీగా పరుగులు చేసింది ఈ ఏడాదే. దీనినిబట్టి అవకాశం ఇవ్వడానికి మరికొంత కాలం వేచి చూడాలని సెలెక్టర్లు భావించడంలో తప్పు లేదు. మరోవైపు నిలకడ లేమి మయాంక్ కెరీర్ ప్రారంభం నుంచి ఉంది. 2008–09లో కూచ్ బెహర్ ట్రోఫీలో 432 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన అతడు, ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్–19 వన్డేలో 160 పరుగులు చేసి సత్తా చాటాడు. కానీ 2010 కుర్రాళ్ల ప్రపంచకప్‌లో నిరాశపరిచాడు. తదనంతరం భారత్ ‘ఎ’ జట్టులో అవకాశం వచ్చినా విఫలమయ్యాడు. అప్పటికింకా అతడు రంజీల్లో అరగేట్రం కూడా చేయలేదు. 2013–14 సీజన్లో రంజీల్లోకి అడుగుపెట్టినా పోటీ కారణంగా ఈ కుడిచేతి వాటం ఓపెనర్‌కు జట్టులో చోటు కష్టంగానే ఉండేది. కేఎల్ రాహుల్ జాతీయ జట్టుకు వెళ్లాక మాత్రమే ఇతడికి స్థిరంగా అవకాశాలు వచ్చాయి. ‘ఓపెనింగ్’ ఖాళీ లేదు... టెస్టుల్లో ధావన్, విజయ్, రాహుల్... వన్డేలు, టి20ల్లో రోహిత్, ధావన్ భారత జట్టుకు ఓపెనర్లుగా స్థిర పడిపోయారు. గాయపడితేనో, తప్పిస్తేనో తప్ప మరొకరికి చాన్స్ ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిఖార్సైన ఓపెనర్ అయిన మయాంక్‌ను ఎంపిక చేసినా ఎక్కడ ఆడించాలో తెలియని పరిస్థితి. అప్పటికీ దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో రాహుల్ వైఫల్యం, రంజీల్లో మయాంక్ అదరగొట్టడం చూసిన విశ్లేషకులు ఇతడిని తీసుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ ఇదంత తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే అగర్వాల్ ఇప్పటికి ఆడింది ఐదు రంజీ సీజన్లే. జట్టులో స్థిరంగా చోటు దక్కింది రెండు–మూడేళ్ల నుంచే. ఈ ఏడాది రంజీలు, విజయ్ హజారేలో దుమ్మురేపిన మయాంక్... టి20 టోర్నీ అయిన ముస్తాక్ అలీలో పెద్దగా ఆకట్టుకోలేదు. 9 మ్యాచ్‌ల్లో 258 పరుగులే చేశాడు. వీటిలో మూడే అర్ధ సెంచరీలున్నాయి.పైగా శ్రీలంకలో జరగనున్న నిదాహస్ ముక్కోణపు ట్రోఫీ టి20 ఫార్మాట్. ఈ లెక్కన చూసినా సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుపట్టలేం. కాబట్టి అగర్వాల్ జాతీయ జట్టులో స్థానం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. మరింకేం చేయాలి...? మయాంక్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలంటే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ స్థిరంగా పరుగులు చేయాలి. గతంలో ఎదురైన ఫిట్నెస్ సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలి. ఇదే సమయంలో టెస్టు ఓపెనర్ విజయ్ 35 ఏళ్లకు దగ్గరవుతున్నాడు. అంటే బ్యాకప్‌ను వెతుక్కోవాల్సిన సమయం. ఆ స్థానాన్ని భర్తీ చేయడాన్ని 27 ఏళ్ల అగర్వాల్ సవాల్‌గా తీసుకోవాలి. కొసమెరుపు: కర్ణాటకకు ఆడినప్పుడు ఓపెనింగ్‌లో పోటీగా మారిన కేఎల్ రాహులే... ఇప్పుడూ మయాంక్ కంటే ముందే జాతీయ జట్టులోకి వచ్చి అతడిని నిరీక్షణ జాబితాలో ఉంచాడు. భారత జట్టులోకి ఎంపికయ్యేందుకు తాను ఎంత చేరువగా వచ్చానో ప్రతీ ఆటగాడికి తెలియాలనేది మా భావన. వారికి ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవద్దు. కాబట్టి మా కమిటీ ప్రతి ఆటగాడితో విడిగా మాట్లాడుతుంది. దేశవాళీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న మయాంక్ అగర్వాల్‌తో నేను స్వయంగా మాట్లాడాను. తన ఆటతో అతను మా దృష్టిలో పడ్డాడని కూడా చెప్పాను. అయితే ఎంపిక విషయంలో మాకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నాం. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం వరుసలో నిలబడిన మయాంక్ తనకంటే ముందున్నవాళ్లను దాటి వెళ్లే పరిస్థితి లేదు. నేను చెప్పిన విషయాన్ని అతను కూడా బాగా అర్థం చేసుకున్నాడు. పైగా మీ దృష్టిలో పడితే చాలు. నాకు తొందరేమీ లేదని అతనే చెప్పాడు. – ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ -
ఆంధ్ర అద్భుతం
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘సి’లో ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అజేయంగా క్వార్టర్స్ చేరిన ఆంధ్ర... గురువారం ఇక్కడ జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో పటిష్ట ఢిల్లీని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. కీలకమైన పోరులో ఆంధ్ర బౌలర్లు శివకుమార్ (4/29), భార్గవ్ భట్ (3/28) విజృంభించడంతో సంచలన విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్ర సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ జట్టు ఆంధ్ర బౌలర్ల ధాటికి నిలవలేక 32.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రికీ భుయ్ (36; 5 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (38; 4 ఫోర్లు) రాణించడంతో 28.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆంధ్ర, సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్ (4), హితేన్ దలాల్ (11)లతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ (8)లను శివకుమార్ పెవిలియన్ పంపి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం నితీశ్ రాణా (2), ప్రదీప్ సాంగ్వాన్ (10) కూడా వారిని అనుసరించారు. రిషభ్ పంత్ (38; 2 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (21; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు స్కోరు వంద దాటింది. ఆంధ్ర బౌలర్లలో బండారు అయ్యప్ప 2, నరేన్‌రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం మరో 21.2 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచి ఆంధ్ర... దేశవాళీ క్రికెట్లో బంతులపరంగా ఢిల్లీకి అతి పెద్ద పరాజయాన్ని మిగిల్చింది. మరో క్వార్టర్ ఫైనల్లో బరోడాపై సౌరాష్ట్ర గెలుపొందింది. మొదట బరోడా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా... ఆ తర్వాత సౌరాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసి సెమీస్‌కు చేరింది. -
అటు ఆంధ్ర... ఇటు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మరోసారి సమష్టి ఆటతీరుతో అదరగొట్టిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది 24 పాయింట్లతో ‘టాపర్’గా నిలువడం విశేషం. గ్రూప్ ‘డి’లో హైదరాబాద్ ఐదు విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. భరత్, విహారి సెంచరీలు చెన్నైలో ముంబై జట్టుతో జరిగిన చివరిదైన ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగులతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 344 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (126 బంతుల్లో 106; 10 ఫోర్లు)... కెప్టెన్ గాదె హనుమ విహారి (118 బంతుల్లో 169; 16 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో ముంబై బౌలర్ల భరతం పట్టారు. ఈ టోర్నీలో భరత్కిది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. భరత్, విహారి రెండో వికెట్‌కు 254 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక చివర్లో రికీ భుయ్ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీలతో చెలరేగి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్దేశ్ లాడ్ (98 బంతుల్లో 118; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (3/55), ఆశిష్ (2/51) రాణించారు. మెరిసిన సందీప్, సిరాజ్ ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను బావనాక సందీప్ (95 బంతుల్లో 79; 4 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (65 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఆదుకున్నారు. రాయుడు అవుటయ్యాక టి.రవితేజ (35 బంతుల్లో 45; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి సందీప్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జతచేశాడు. చివర్లో ఆకాశ్ భండారి (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/37) హడలెత్తించాడు. సిరాజ్ ధాటికి ఛత్తీస్గడ్ 44.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ రెండు వికెట్లు తీయగా... రవికిరణ్, ఆకాశ్ భండారి, సందీప్‌లకు ఒక్కో వికెట్ లభించింది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరోడా, కర్ణాటక; గ్రూప్ ‘బి’ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర; గ్రూప్ ‘సి’ నుంచి ముంబై; గ్రూప్ ‘డి’ నుంచి సౌరాష్ట్ర క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మిగతా జట్లు. నాకౌట్ దశ మ్యాచ్‌లు ఈనెల 21 నుంచి 27 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతాయి. 21న రెండు క్వార్టర్ ఫైనల్స్... 22న మరో రెండు క్వార్టర్స్ ఫైనల్స్ నిర్వహిస్తారు. 24న, తొలి సెమీఫైనల్, 25న రెండో సెమీఫైనల్... 27న ఫైనల్ జరుగుతుంది. -
ముంబై వన్డే జట్టులో పృథ్వీ షా
అండర్–19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే ముంబై వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే 16 మంది సభ్యుల జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం ప్రకటించింది. వికెట్ కీపర్ ఆదిత్య తారే సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో పృథ్వీ షాకు స్థానం దక్కింది. ఈ ఏడాది రంజీ జట్టులో భాగమైన పృథ్వీ షా వన్డే జట్టుకు ఎంపికకావడం ఇదే తొలిసారి. -
ధోని మళ్లీ రైలెక్కాడు...
⇔13 ఏళ్ల తర్వాత ప్రయాణం ⇔విజయ్ హజారే టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా బరిలోకి కోల్‌కతా: ఔను... ధోని రైలెక్కాడు! జార్ఖండ్ వన్డే క్రికెట్ జట్టుతో పాటు రాంచీ నుంచి హౌరా వరకు ప్రయాణించాడు. అది కూడా ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు, సేవలు పొందకుండానే! ఓ సాధారణ ప్రయాణికుడిలా ఉల్లాసంగా తన జర్నీ సాగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అదేంటో ఏమోగానీ... ధోని ఏం చేసినా... ధనాధన్ సహజమేనేమో! క్రీజులో దిగినా... వీరబాదుడు బాదినా... సిక్సర్లతో మ్యాచ్‌ల్ని ముగిం చినా, చివరకు ఆకస్మిక నిర్ణయాలు చిటికెలో తీసుకున్నా... అన్ని మెరుపు వేగంతోనే! అప్పుడేమో భారత విజయవంతమైన సారథిగా వెలుగొందుతూనే టెస్టు కెరీర్‌కు బైబై చెప్పాడు. ఈ మధ్యే వన్డే సారథ్యాన్ని వద్దన్నాడు. తాజాగా తన రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తానన్నాడు. అదే పనిలో జట్టులో నేను ఓ ఆటగాడినేనంటూ అందరితో పాటు క్రియా యోగ ఎక్స్‌ప్రెస్‌లో 2టయర్ ఏసీ బోగీలో ప్రయాణించాడు. విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీ కోసం మంగళవారం రాత్రి రాంచీలో రైలెక్కిన ధోని సేన బుధవారం ఉదయం హౌరాలో దిగింది. 13 ఏళ్ల తర్వాత గతంలో తను టీటీఈగా పనిచేసిన ఖరగ్‌పూర్ స్టేషన్ మీదుగా ఈ ప్రయాణం సాగింది. ‘ధోని కోసం జార్ఖండ్ జట్టు వర్గాలు ప్రత్యేక బోగీని కోరలేదు. అయితే ధోని వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈఆర్) పౌర సంబంధాల అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. ఈ రైల్వే జోన్లోనే ధోని 2001 నుంచి 2004 వరకు ఖరగ్‌పూర్ స్టేషన్లో టీటీఈగా పనిచేశాడు. ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఈనెల 25న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ జాతీయ వన్డే టోర్నీలో ధోనితోపాటు భారత స్టార్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ పంజాబ్ తరఫున... రోహిత్ శర్మ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నారు.