న్యూఢిల్లీ: తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబై జట్టు ఓపెనర్ పృథ్వీ షా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ సెంచరీతో (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్స్‌లు) కదంతొక్కాడు. దాంతో ముంబై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజా ప్రదర్శనతో లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా పృథ్వీ షా ఘనత వహించాడు.
గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (183 నాటౌట్; శ్రీలంకపై 2005లో) పేరిట ఉండేది. తొలుత సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 పరుగులు చేసింది. సమర్థ్ వ్యాస్ (90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), చిరాగ్ జానీ (53 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 41.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 285 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న షా ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడికి యశస్వి జైస్వాల్ (104 బంతుల్లో 75; 10 ఫోర్లు, సిక్స్) తోడవ్వడంతో ముంబై ఛేదన సాఫీగా సాగింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 238 పరుగులు జోడించారు. అనంతరం జైస్వాల్ అవుటైనా క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారే (20 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి పృథ్వీ లాంఛనం పూర్తి చేశాడు. ఈ టోర్నీలో షాకిది మూడో సెంచరీ.
మరో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీపై ఉత్తరప్రదేశ్ 46 పరుగుల ఆధిక్యంతో నెగ్గింది. తొలుత ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్ (112; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. కరణ్ శర్మ (83; 11 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఢిల్లీ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో గుజరాత్‌తో ఉత్తరప్రదేశ్; కర్ణాటకతో ముంబై తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment