ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి.
జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment