ముంబై : భారత టెస్టు క్రికెట్ మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా జాఫరే పీటీఐ వార్త సంస్థకు వెల్లడించాడు. ఏడాది పాటు ఉత్తరాఖండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నట్లు పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక మొదటిసారి కోచ్‌గా పనిచేయనున్న జాఫర్ తన అంతరంగాన్ని పంచుకున్నాడు. 'నేను మొదటిసారి ఒక జట్టుకు కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి నాకు ఇప్పుడు కొత్తగాను, ఒక చాలెంజింగ్ అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక ఆటగాడిగా సేవలందించిన నేను ఇక జట్టును తీర్చిదిద్దేపనిలో ఉండడం అదృషంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్ జట్టు నాకు కొత్తైనా వారి ప్రదర్శన మాత్రం బాగానే ఉంది. 2018-19 రంజీ సీజన్‌లో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్‌లో విదర్భతో తలపడి ఓడిపోయింది. దీంతో వారు గ్రూఫ్-డి( ప్లేట్ గ్రూఫ్‌కు) పడిపోయారు. ప్రస్తుతం గ్రూఫ్-డిలో ఉన్న ఉత్తరాఖండ్ జట్టును టాప్‌లో నిలపడమనేది నా ముందున్న సవాల్.(‘భువీ చాలా అందంగా ఉన్నాడు.. హీ ఈజ్ హాటెస్ట్’)
ఇప్పుడున్న తరుణంలో జట్టును కింద నుంచి పైస్థానానికి తీసుకురావడం అనేది కోచ్‌గా అనుభవాన్ని నేర్పిస్తుంది. జట్టులో మంచి టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిని మరింత రాటు దేల్చడమే నా లక్ష్యం. స్వతహగా నేను ముంబై, విదర్భ జట్లకు ఆడేటప్పుడు ఉత్తరాఖండ్ జట్టును పరిశీలించాను. గత ఐదారేళ్లలో క్రికెట్‌లోకి వచ్చిన ఎంతో మంది యువకులకు ఆటలో మెళుకువలు ఇస్తూ వారికి మార్గ నిర్దేశనం చేశా. ప్రస్తుతం కోచ్ అవకాశం రావడంతో మరింత మంది యువకులకు నా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా' అంటూ పేర్కొన్నాడు.
వసీం జాఫర్ కొంతకాలం కిందట ఆటకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు.కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వసీం..మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేయగా.. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment