Vijay Hazare Trophy: వన్డేల్లో కుర్రాళ్ల సత్తాకు పరీక్ష | Vijay Hazare Tournament starts from today | Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy: వన్డేల్లో కుర్రాళ్ల సత్తాకు పరీక్ష

Published Sat, Dec 21 2024 3:52 AM | Last Updated on Sat, Dec 21 2024 9:22 AM

Vijay Hazare Tournament starts from today

నేటి నుంచి విజయ్‌హజారే టోర్నీ 

నాగాలాండ్‌తో హైదరాబాద్, రైల్వేస్‌తో ఆంధ్ర పోరు 

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో టి20 సమరం ముగిసిన తర్వాత ఇప్పుడు వన్డే పోరుకు రంగం సిద్ధమైంది. విజయ్‌హజారే వన్డే టోర్నీలో భాగంగా నేటినుంచి దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలు వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత వన్డే జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఉండగా...మున్ముందు వన్డే టీమ్‌లో స్థానం ఆశిస్తున్న ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇది సరైన అవకాశం కానుంది. 

ఈ ఆటగాళ్ల కారణంగా టోర్నీపై ఆసక్తి పెరగడంతో పాటు తీవ్రమైన పోటీ కారణంగా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం కూడా ఉంది. బరోడా తరఫున ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బరిలోకి దిగుతున్నాడు. టి20లో ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు పేస్‌ బౌలర్లు వన్డే టీమ్‌లో తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అర్‌‡్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌), అవేశ్‌ ఖాన్‌ (మధ్యప్రదేశ్‌), ఖలీల్‌ అహ్మద్‌ (రాజస్తాన్‌), ముకేశ్‌ కుమార్‌ (బెంగాల్‌), యశ్‌ దయాళ్‌ (యూపీ) తమ బౌలింగ్‌కు పదును పెడుతున్నారు. 

స్పిన్నర్లలో వరుణ్‌ చక్రవర్తి (తమిళనాడు), కుల్దీప్‌ యాదవ్‌ (యూపీ), రవి బిష్ణోయ్‌ (రాజస్తాన్‌) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాటర్లలో అందరి దృష్టీ శ్రేయస్‌ అయ్యర్‌పై ఉంది. వన్డే టీమ్‌లో  తన స్థానాన్ని ఖాయం చేసుకున్న అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా టి20 మెరుపులను దాటి వన్డే టీమ్‌లో రెగ్యులర్‌గా మారే క్రమంలో ఈ టోర్నీ తగిన వేదిక కానుంది. 

భారత ఆటగాడు రింకూ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ కెపె్టన్‌గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. సీనియర్‌ స్థాయిలో అతను తొలిసారి సారథిగా వ్యవహరించనుండటం విశేషం.   భారత ఆటగాడు, ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెపె్టన్‌ అయిన సంజు సామ్సన్‌కు కేరళ జట్టులో చోటు లభించలేదు. తాము నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లనుంచే జట్టును ఎంపిక చేయాలని కేరళ క్రికెట్‌ సంఘం నిర్ణయం తీసుకోవడంతో సామ్సన్‌ పేరును పరిశీలించనే లేదు. 

కర్నాటక టీమ్‌ కూడా సీనియర్‌ బ్యాటర్‌ మనీశ్‌ పాండేకు ఉద్వాసన పలికింది. ఇక కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కర్నాటక అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో కలిపి 117 పరుగులే చేసిన పాండే ప్రభావం చూపలేకపోయాడు. మరో వైపు ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో రాణించిన బెంగాల్‌ పేసర్, భారత సీనియర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీను వన్డే టీమ్‌లోకి కూడా తీసుకున్నారు.

అయితే నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో మాత్రం షమీ  ఆడకుండా విశ్రాంతి తీసుకుంటాడని బెంగాల్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మరో మ్యాచ్‌లో త్రిపురతో బరోడా తలపడుతుంది.   అహ్మదాబాద్‌లో జరిగే గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో నాగాలాండ్‌తో తిలక్‌ వర్మ సార«థ్యంలోని హైదరాబాద్‌ తలపడుతుంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ముంబైలో జరిగే మ్యాచ్‌లో రైల్వేస్‌ను శ్రీకర్‌ భరత్‌ సార«థ్యంలోని ఆంధ్ర జట్టు ఎదుర్కొంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement