విజయేందర్
* ఆసియా పసిఫిక్ చాంపియన్ టైటిల్ సొంతం
* సూపర్ మిడిల్ వెయిట్ బౌట్‌లో హోప్‌పై గెలుపు
న్యూఢిల్లీ: భారత బాక్సర్ విజేందర్ సింగ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించి, ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు... తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్‌లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించాడు. దీంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్‌లకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
గత ఆరు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసి జోరు మీదున్న విజేందర్... శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్‌లో 98-92, 98-92, 100-90తో కెర్రీపై నెగ్గాడు. 10 రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్‌లో భారత బాక్సర్ మంచి ప్రణాళికతో ఆడాడు. ప్రత్యర్థి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరంభంలో భారీ పంచ్‌లకు పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. తొలి మూడు రౌండ్లలో ఇద్దరు బాక్సర్లు కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. నాలుగో రౌండ్‌లో విజేందర్ విసిరిన రైట్ హుక్... హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకడంతో వాపు వచ్చింది.ఇక ఇక్కడి నుంచి భారత్ బాక్సర్ ఆధిపత్యం కొనసాగింది. ఐదో రౌండ్‌లో హోప్ తన అనుభవాన్ని రంగరిస్తే... విజేందర్ పంచ్‌ల్లో పదును పెంచాడు. ఆరో రౌండ్‌లో ఇద్దరు బాక్సర్లు పంచ్‌ల్లో వైవిధ్యాన్ని చూపెట్టారు. ఏడో రౌండ్‌లో విజేందర్ కొట్టిన బలమైన షాట్‌కు హోప్ దాదాపుగా పడిపోయాడు. కానీ అంతలోనే తేరుకున్న అతను విజేందర్ బాడీపై పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. అయితే విజేందర్ కూడా రింగ్‌లో చురుకుగా కదులుతూ నెమ్మదిగా బయటపడ్డాడు. ఎనిమిదో రౌండ్‌లో విజేందర్ ఎదురుదాడిని ముమ్మరం చేస్తే హోప్ కాస్త అలసిపోయినట్లు కనిపించాడు.
ఇక తొమ్మిదోరౌండ్‌లో విజేందర్ పోరాట స్ఫూర్తితో ఆకట్టుకున్నాడు. విజేందర్.. హోప్ ముఖంపై పంచ్‌లు విసరడంలో సఫలంకాగా, హోప్ లెఫ్ట్ హుక్స్‌తో అదరగొట్టాడు. ఆఖరి రౌండ్‌లో అలసిపోయిన విజేందర్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. హోప్ దాడి చేసినా.. భారత బాక్సర్ నేర్పుగా అడ్డుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ఈ బౌట్‌ను తిలకించారు.
ఐబీసీ చాంపియన్‌గా సిద్ధార్థ్
అంతకుముందు జరిగిన బౌట్‌లో సిద్ధార్థ్ వర్మ 80-73, 79-73, 77-75తో దిల్బాగ్ తాకరన్‌పై నెగ్గి ‘ఐబీసీ సూపర్ వాల్టర్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను సాధించాడు. ఇతర బౌట్‌లలో సంజీవ్ సహోటా (యూకే) 40-37, 40-36, 40-37తో వికాస్ లోహన్‌పై; కుల్దీప్ దండా 60-52, 60-55, 60-53తో విచయాన్ ఖమోన్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. సుమిత్ రాణా, గగన్‌ప్రీత్‌లు కూడా తమ ప్రత్యర్థులపై నెగ్గారు.