నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ఆమె పసిడి ‘పట్టు’ ముగిసినా... టోక్యో దారి మిగిలే ఉంది. మహిళల 53 కేజీల కేటగిరీలో ఆమెకు ‘రెపిచేజ్’తో కాంస్యం గెలిచే అవకాశాలున్నాయి. మరో మహిళా రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) కూడా ఓడినప్పటికీ, వినేశ్ లాగే ఒలింపిక్స్ బెర్తు, కాంస్యం చేజిక్కించుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7–0తో వినేశ్‌ను ఓడించింది. అనంతరం ఈ జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్‌కు నేడు జరిగే ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆమె కాంస్యం గెలవాలంటే ముగ్గురిని ఓడించాలి.
లేదంటే కనీసం ఇద్దరిపై గెలిచినా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తుంది. యులియా (ఉక్రెయిన్), ప్రపంచ నంబర్‌వన్ సారా అన్ (అమెరికా), ప్రివొలరకి (గ్రీస్)లతో వినేశ్ తలపడనుంది. ఇప్పటివరకు కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వినేశ్... ప్రపంచ రెజ్లింగ్‌లో మాత్రం నెగ్గలేకపోయింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో సీమా 2–9తో మరియా స్టాండిక్ (అజర్‌బైజాన్) చేతిలో పరాజయం చవిచూసింది. మూడు ఒలింపిక్ పతకాల విజేత అయిన మరియా ఫైనల్ చేరడంతో సీమా కూడా ‘రెపిచేజ్’ అవకాశం దక్కించుకుంది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే ఆమె... మెర్సి(నైజీరియా), పొలెస్‌చుక్ (రష్యా)లను ఓడించాలి. కాంస్యం నెగ్గాలంటే వారిద్దరితో పాటు చైనా రెజ్లర్ యనన్ సన్‌పై గెలవాలి. భారత్‌కే చెందిన కోమల్ (72 కేజీలు), లలిత (55 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. వారిని ఓడించిన రెజ్లర్లు ఫైనల్‌కు చేరకపోవడంతో మరో అవకాశం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment