తొలిసారి అసెంబ్లీకి.. హర్యానా ఎన్నికల్లో వినేశ్‌ ఫోగట్‌ విజయం | Haryana Results: Phogat wins from Julana constituency by 5763 votes | Sakshi
Sakshi News home page

తొలిసారి అసెంబ్లీకి.. హర్యానా ఎన్నికల్లో వినేశ్‌ ఫోగట్‌ విజయం

Published Tue, Oct 8 2024 2:24 PM | Last Updated on Tue, Oct 8 2024 2:48 PM

Haryana Results: Phogat wins from Julana constituency by 5763 votes

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణక్షణం.. రౌండ్‌ రౌండ్ అధిక్యాలు తారుమారు అవుతుండటంతో తుది గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.

తాజాగా భారత రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్‌ ఫొగట్‌ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్‌ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్‌ పైచేయి సాధించారు. తొలి నుంచి లీడ్‌లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకున్నారు. 

 దీంతో తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వినేశ్‌.. హర్యానా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె ఒట్టి చేతులతో  స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ తరువాత కొన్ని రోజులకే ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జులానా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.

ఇదిలా ఉండగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది..మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 50, కాంగ్రెస్ 34, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement