న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసినప్పటికీ.. ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడ్డాయి. ఊహించని విధంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హర్యానా ఫలితాలపై, పార్టీ పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. అయిలే పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో అగ్రమాలు జరిగాయని రాహుల్ ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఇక హర్యానాలో వెలువడిన అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషిస్తున్నాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. మద్దతు ఇచ్చినందుకు హర్యానా ప్రజలందరికీ, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థికన్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆశలు ఆవిరి చేస్తూ 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. 1966లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment