హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బొర్లా పడిన కాంగ్రెస్‌కు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో వ్యవహరించిన హస్తానికి ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంచనాలన్నీ తలకిందలు కావడంతో.. అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది.
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ మాట్లాడుతూ.. తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని అన్నారు.
ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్‌కు ఇటీవల లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామని.. అయినప్పటికీ హరియాణా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్ విమర్శించింది. హరియాణా ఎన్నికల్లో పొత్తుకోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడింది.
కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని ముందుగా కాంగ్రెస్, ఆప్ భావించాయి. కానీ సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చవిచూశాయి. మెజార్టీ మార్కుకు కాంగ్రెస్ దూరం కాగా.. ఆప్ అసలు ఖాతా తెరవలేదు. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment