మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు | Viral Mahindra Shared Three Year Old Video Of Dhoni | Sakshi
Sakshi News home page

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Published Tue, Jul 23 2019 4:40 PM | Last Updated on Tue, Jul 23 2019 4:56 PM

Viral Mahindra Shared Three Year Old Video Of Dhoni - Sakshi

ముంబై : కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన వీడియోలను, విషయాలను షేర్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆనంద్‌ మహీంద్ర చేసిన చారులత, పేపర్‌ బాయ్‌ ట్వీట్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో టీమిండియా సీనియర్‌ ఆటగాడు ధోనికి సంబంధించిన మూడేళ్ల క్రితం వీడియోతోపాటు ఆయన చేసిన పోస్ట్‌కు నెటిజన్లు హాట్సాఫ్‌ చెబుతున్నారు. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌లో రెండో అంతరార్థన్ని గుర్తించిన నెటిజన్లు ఆయన వ్యాపార తెలివికి సెల్యూట్‌ చేస్తున్నారు 

‘ధోని, ఆర్మీ దుస్తుల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌.. అదేవిధంగా నీ ప్రయాణానికి కేటాయించిన వాహనంలో నువ్వు మరింత హుందాగా కనిపిస్తున్నావు’అంటూ మూడేళ్ల క్రితం వీడియోతో పాటు ఈ సందేశాన్ని తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ధోని ప్రయాణించిన వాహనం మహీంద్ర XUV 500. తన సంస్థకు చెందిన వాహనంలో ధోని ప్రయాణించడంతో ఆనంద్‌ మహీంద్ర ఆ విధంగా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

ఇక వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు ఆడే సిరీస్‌ నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఎనిమిదేళ్ల నుంచి అతడు పారాచూట్‌ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ధోనికి దేశభక్తి ఎక్కువ.. అంటూ క్రికెట్‌ భారతం ఉబ్బితబ్బిబ్బై పోతుంది. పలు సందర్భాల్లో దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను నెమరవేసుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement