
విరాట్ కోహ్లి
విండీస్‌పై 6 అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డు ..
సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెచ్చిపోయాడు. అచ్చొచ్చిన మైదానంలో అలవోకగా మరో శతకం బాదేశాడు. 106 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 37వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10వేల మైలురాయి అందుకున్న కోహ్లికి.. ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో విండీస్‌పై 6 అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. గిబ్స్/ఆమ్లా/డివిలియర్స్‌ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లి తాజా సెంచరీతో అధిగమించాడు.
మంచినీళ్లు తాగినట్లే సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఇక వైజాగ్ మైదానం ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక్క మిర్పూర్‌లోనే కోహ్లి 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదాడు. ఆ తర్వాత వైజాగ్ అతనికి ఫేవరేట్ స్పాట్ కావడం విశేషం. మరోవైపు భారత్ వరుసగా వికెట్లు కోల్పోతున్నా తన ఆటలో ఎలాంటి తడబాటు లేదు. తెలుగు కెరటం అంబటి రాయుడు (73) మినహా మిగతా ఆటగాళ్లు రోహిత్ శర్మ(4), ధావన్ (29), ధోని (20), పంత్ (17)లు విఫలమయ్యారు. అయినా పరుగుల యంత్రం కోహ్లి విజృంభిస్తున్నాడు.