
బెంగళూరు: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తమను భయపెట్టాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ధోని వీర విహారం చేయడంతో మ్యాచ్ చేజారుతుందని తాము భయపడ్డామని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉద్వేగంగ సాగింది. చివరి వరకు మేము గట్టిగానే పోరాడాం. ఈ పిచ్‌లో 160 పరుగుల స్కోరును కాపాడుకోవడం మామూలు విషయం కాదు. చివరి బంతి అయితే ఎంతో ఉత్కంఠ రేపింది. మొత్తానికి మ్యాచ్ గెలవడం మాకెంతో సంతోషానిచ్చింది. మా బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడిన ధోని మమ్మల్ని చాలా భయపెట్టాడ’ని అన్నాడు.
గత మ్యాచ్‌లో రాణించినందునే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీని బ్యాటింగ్‌లో ముందు పంపామని విరాట్ కోహ్లి వెల్లడించాడు. ఈ సీజన్‌లో మరొక్క మ్యాచ్ మాత్రమే అతడు ఆడతాడని తెలిపాడు. ‘మొదటి 6 ఓవర్ల వరకు బంతి ఎక్కువగా బ్యాట్‌పైకి రాదని అంచనా వేశాం. పార్థీవ్ పటేల్, డివిలియర్స్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మ్యాచ్ మధ్యలో ఉండగా 175 పరుగుల స్కోరు చేసే అవకాశముందని అనుకున్నాం. అయితే అనుకున్న స్కోరు కంటే 15 పరుగులు తక్కువగా చేశాం. ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ మీద ఆడే అవకాశం చెన్నై బౌలర్లు మాకు ఇవ్వలేద’ని కోహ్లి వివరించాడు. 10 మ్యాచ్‌లు ఆడి 6 పాయింట్లు దక్కించుకున్న ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలున్నాయి. 24న జరిగే మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆర్సీబీ తలపడనుంది. (చదవండి: ధోని మెరుపులు వృథా)
Comments
Please login to add a commentAdd a comment