
ప్రపంచాన్ని గెలిచిన భారత స్టార్ విరాట్ కోహ్లి కెరీర్‌లో 2014 ఇంగ్లండ్ పర్యటన ఒక చేదు జ్ఞాపకం. 5 టెస్టుల సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులే చేయగలిగాడు. సగటు 13.40 కాగా అత్యధిక స్కోరు 39 మాత్రమే. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్‌లు ఆఫ్‌స్టంప్‌పై వేసిన బంతులను ఎదుర్కొనడంలో కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు. ధోని నాయకత్వంలో ఆ సిరీస్‌ను భారత్ 1–3తో కోల్పోయింది. ఆ తర్వాత తన టెక్నిక్‌ను మార్చుకున్న కోహ్లి... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో తన రికార్డు మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉన్న విరాట్... అందుకు కౌంటీ క్రికెట్ ఆడటమే సరైన సన్నాహకంగా భావిస్తున్నాడు.
ముంబై: ఇటీవల దక్షిణాఫ్రికాలో త్రుటిలో టెస్టు సిరీస్ చేజార్చుకున్న అనంతరం సన్నాహాల ప్రాధాన్యతను బీసీసీఐ గుర్తించింది. సఫారీ జట్టుతో తొలి టెస్టుకు కేవలం వారం ముందు మాత్రమే అక్కడికి చేరిన టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా వద్దనుకుంది. చివరకు సిరీస్ ఓడాక మరికాస్త ముందుగా వెళితే బాగుండేదని కోచ్ సహా అందరూ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో అలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న బోర్డు... సాధ్యమైనంత ఎక్కువ మంది భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడేలా సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా చేరుతున్నాడు. రాబోయే జూలై–సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు కోహ్లి అక్కడి కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం కోహ్లికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కౌంటీల్లో సర్రే జట్టుకు విరాట్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆ జట్టు తరఫున కోహ్లి మూడు మ్యాచ్‌లు ఆడతాడు. ప్రధానంగా ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులు, స్వింగ్‌తో పరీక్ష పెట్టే డ్యూక్ బంతులకు అలవాటు పడేందుకు కౌంటీ క్రికెట్ కోహ్లికి ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.
ఐపీఎల్ తర్వాత... : ‘ఏ జట్టుకైనా సన్నద్ధత అనేది చాలా ముఖ్యం. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు కొద్ది రోజుల ముందుగా అక్కడకు వెళ్లే అవకాశం వస్తే బాగుంటుంది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. సమయం లభిస్తే తప్పకుండా వెళ్లి ఆడతాను’ స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన తర్వాత 2016లోనే కోహ్లి చెప్పిన మనసులో మాట ఇది. ఇంగ్లండ్ గడ్డపై కూడా బాగా ఆడాలనే కసి అతని మాటల్లో కనిపించింది. ఇప్పుడు దానికి సిద్ధమయ్యాడు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూన్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే విరాట్ కౌంటీలు ఆడేందుకు వెళతాడు. ఈ క్రమంలో జూన్ 14–18 మధ్య బెంగళూరులో అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు నుంచి కోహ్లితోపాటు ఇషాంత్, పుజారా, అశ్విన్ తప్పుకోవడం ఖాయమైంది.
‘ఎ’ జట్టులో సీనియర్లు...
ఈ సీజన్‌లో కోహ్లికి ముందే భారత ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (యార్క్‌షైర్), ఇషాంత్ శర్మ (ససెక్స్), అశ్విన్ (వార్విక్‌షైర్) కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. మరోవైపు జూన్‌లో భారత ‘ఎ’ జట్టు ఇంగ్లండ్‌లోనే నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఈ టీమ్‌లో కూడా టెస్టు జట్టు సభ్యులైన సీనియర్లను చేరిస్తే వారికి మంచి ప్రాక్టీస్ లభిస్తుందని బోర్డు భావిస్తోంది. కోహ్లి, రవిశాస్త్రి, బోర్డు సీఈఓ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్, ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్‌లతో చర్చించి సీఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘దక్షిణాఫ్రికా పర్యటనతో మేం పాఠం నేర్చుకున్నాం. కీలక సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ ప్రాధాన్యత గుర్తించాం. అందుకే కోహ్లితో పాటు ఇతర సీనియర్లు కూడా కౌంటీల్లో ఆడేందుకు అనుమతినిచ్చాం. మరికొందరు సీనియర్లు ‘ఎ’ జట్టు సభ్యులుగా ఇంగ్లండ్‌కు వెళతారు’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. మరో వైపు ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా ఆడుతున్న అనేక మందికి అఫ్గానిస్తాన్‌తో జరిగే టెస్టులో అవకాశం దక్కనుండగా... పటిష్టమైన జట్టునే బరిలోకి దింపుతామని అఫ్గాన్ క్రికెట్‌కు సీఓఏ హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment