
కోహ్లీ.. వెంటనే నీ పేరు మార్చుకో!
భారత జట్టుపై కానీ, మన క్రికెటర్లపై కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దీటుగా కౌంటర్ ఇస్తాడు. అలాగే టీమిండియా విజయాలను, ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ మంచి కామెంట్లు చేస్తుంటాడు. ట్విట్టర్ వేదికగా వీరూ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు పని చెబుతుంటాడు. సెహ్వాగ్ మనసు ఈసారి భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వైపు మళ్లింది. విరాట్ వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించాడు. ఏం పేరు పెట్టుకోవాలో కూడా ట్వీట్ చేశాడు. వీరూ ఇలా కామెంట్ చేయడానికి కారణమేంటంటే..
ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే. బ్యాట్స్‌మన్‌గా, టెస్టు కెప్టెన్‌గా రికార్డులు తిరగరాస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో పరుగుల సగటు దాదాపు 90 శాతం ఉంది. కోహ్లీ ప్రదర్శన వీరూకు కూడా తెగనచ్చేసింది. విరాట్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, అతను మెరుపులాంటివాడని కితాబిచ్చాడు. విరాట్ వెంటనే తన పేరును మెరుపుగా మార్చుకోవాలని సూచించాడు. వీరూ సూచనకు విరాట్ ఎలా స్పందిస్తాడో చూడాలి.