
విరాట్ కోహ్లీ @ 28
టీమిండియా బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ 29వ ఏట అడుగుపెట్టాడు.
టీమిండియా బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ 29వ ఏట అడుగుపెట్టాడు. శనివారం (నవంబర్ 5) విరాట్ కు 28వ పుట్టినరోజు. కోహ్లీ బర్త్ డే ఎలా సెలెబ్రేట్ చేసుకున్నాడు? గాళ్ ఫ్రెండ్ అనుష్క శర్మతో కలిశా లేక కుటుంబ సభ్యులతోనా? వంటి విషయాలు తెలియవు కానీ.. ఈ ఏడాది బ్యాట్తో మాత్రం అతను తెగ ఎంజాయ్ చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ పరుగుల యంత్రంలా అన్ని ఫార్మాట్లలోనూ విజృంభించాడు. టెస్టు జట్టు కెప్టెన్గానూ టీమిండియాకు విజయాలందించాడు.
ఈ ఏడాదిలో విరాట్ సాధించిన ఘనతలు
ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ సారథ్యంలో కోహ్లీ ఐదు వన్డేలు ఆడాడు. ఈ సిరీస్లో టీమిండియా 1-4తో ఓడిపోయినా విరాట్ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో మొత్తం 381 పరుగులు చేశాడు. ఇదే పర్యటనలో భారత్ మూడు టి-20ల సిరీస్ను వైట్వాష్ చేయడంలో కోహ్లీది కీలక పాత్ర. మూడు హాఫ్ సెంచరీలతో మొత్తం 199 పరుగులు చేశాడు.
వన్డే ఫార్మాట్లో విరాట్ 25 సెంచరీలు పూర్తి చేశాడు. అంతేగాక వేగంగా 7500 పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక వన్డేల్లో ఛేజింగ్ చేసి గెలిచిన మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా విరాట్.. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (14) రికార్డును సమం చేశాడు.
ఆసియా కప్ టి-20 టైటిల్ సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టి-20 ప్రపంచ కప్లో విరాట్ ఐదు మ్యాచ్ల్లో 273 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు.
ఐపీఎల్లో ఓ సీజన్లో 900 పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సెంచరీలు (4) చేసిన బ్యాట్స్మన్గా మరో ఘనత సాధించాడు.
ఇక టెస్టుల్లోనూ విరాట్ తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్, న్యూజిలాండ్లతో సిరీస్లలో విరాట్ రెండు డబుల్ సెంచరీలు చేశాడు. టెస్టు క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా కెప్టెన్ కోహ్లీయే.
హ్యాప్ బర్త్ డే విరాట్.. ఇలాగే మరిన్ని రికార్డులు, విజయాలు సాధించాలి. బెస్ట్ ఆఫ్ లక్.