కుంబ్లే రాజీనామాపై సెహ్వాగ్ ఇలా..
న్యూఢిల్లీ:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి ఇటీవల అనిల్ కుంబ్లే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మరోసారి టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న తరుణంలో కుంబ్లే ఇలా రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లితో విభేదాలు తారాస్థాయికి చేరిన క్రమంలోనే విండీస్ పర్యటనకు బీసీసీఐ ఇచ్చిన ఆఫర్ ను సైతం వద్దనుకుని వీడ్కోలు చెప్పేసినట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంచితే, ఇప్పటికే కుంబ్లే మద్దతుగా పలువురు మాజీ ఆటగాళ్లు స్పందించగా, తాజాగా కొత్త కోచ్ రేసులో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా పెదవి విప్పాడు.
'కుంబ్లే కోచ్ గా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఆడలేదు. అతను నా సీనియర్ ఆటగాడిగా, కెప్టెన్ గా ఉన్నాడు. ఒకసారి జట్టులో స్థానం కోల్పోయిన తరువాత కుంబ్లే కెప్టెన్ గా ఉన్నప్పుడు తిరిగి జట్టులోకి వచ్చా. కుంబ్లే ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు గొప్ప విజయాలు అందుకుంది. రాబోవు టీమిండియా కోచ్ ఎవరైనా.. అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కోచ్ గా అతను సాధించిన విజయాలు తక్కువ సమయంలో మరొకరు అందుకోవడం కష్టమని సెహ్వాగ్ అన్నాడు.