టీమిండియా కోచ్ గా అతనే సరైన వ్యక్తి..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తి అంటున్నాడు మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్. భారత్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లేనే తాను ఇప్పటికీ సూచిస్తానని, అయితే అతను రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సెహ్వాగ్ ను ఎంపిక చేస్తే బాగుంటుందన్నాడు. ఏడాది కాలంగా భారత జట్టు ఘన విజయాల్లో పాలుపంచుకున్న కుంబ్లే స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి సెహ్వాగ్ అని వాడేకర్ తెలిపాడు. 'నేనింకా అనిల్ కుంబ్లే పేరునే కోచ్ పదవికి ప్రిఫర్ చేస్తా. ఏడాది కాలంలో భారత విజయాల్ని చూస్తే కుంబ్లేను ఎవరూ కాదనరు. మనమంతా కుంబ్లే సముచిత గౌరవం ఇవ్వాలి. అయితే కుంబ్లే వైదొలిగిన నేపథ్యంలో కుంబ్లే వారసుడిగా సెహ్వాగ్ పేరును నేను సూచిస్తా. కుంబ్లే స్థానాన్ని సెహ్వాగ్ భర్తీ చేయగలడు.
భారత క్రికెట్ జట్టుకు తాను కోచ్ గా పని చేసిన కాలంలో కుంబ్లే జట్టులో ఉన్న విషయాన్ని వాడేకర్ గుర్తు చేసుకున్నాడు. కుంబ్లే చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి అని, ఎంతో హుందాగా ఉండేవాడని వాడేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతనికి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి అని, ఎప్పుడూ విజయమే లక్ష్యంగా తన ప్రణాళికల్ని రూపొందించుకునే వాడని ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు.