ఆ ఇద్దరూ కాదు.. వీళ్లిద్దరూ ఉంటేనే: సెహ్వాగ్
న్యూఢిల్లీ: వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భారత జట్టులో ఎవరూ భర్తీ చేయలేరని గత రెండు రోజుల క్రితం పేర్కొన్న వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను కూడా వెనుకేసుకొచ్చాడు. వచ్చే వరల్డ్ కప్ లో భారత జట్టు సమతుల్యంగా ఉండాలంటే యువరాజ్, సురేశ్ రైనాలు ఉండాల్సిందేనని పరోక్ష హెచ్చరిక చేశాడు.ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో చోటు దక్కని యువరాజ్, రైనాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వారి ఎంపికపై దృష్టి పెట్టాలన్నాడు. వారిద్దరూ మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాళ్లనే సంగతి జట్టు యాజమాన్యం తెలుసుకోవాలన్నాడు. శ్రీలంక పర్యటనకు గాను వీరి స్థానాల్లో చోటు దక్కించుకున్న మనీష్ పాండే, కేదర్ జాదవ్ లకు పెద్దగా అనుభవం లేదని విషయాన్ని ఇక్కడ మనం అంగీకరించాల్సి ఉందన్నాడు.
భారత జట్టు మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలంటే మనీష్, జాదవ్ ల అనుభవం అంతగా సరిపోదని సెహ్వాగ్ తన అభిప్రాయంగా చెప్పాడు. ఒకవేళ వచ్చే వరల్డ్ కప్ కు మనీష్, జాదవ్ లు జట్టులో ఉండాలంటే మాత్రం అప్పటికి వారిద్దరూ వంద వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం సంపాదించుకోవాలన్నాడు. అప్పుడే వారు వరల్డ్ కప్ కు సరైన ప్రణాళికతో సిద్ధం కావడానికి ఆస్కారం ఉంటుందన్నాడు. ఏదొక మ్యాచ్ ను బట్టి ఒక ప్రధాన ఆటగాడి ఆటను అంచనా వేయొద్దని సెహ్వాగ్ హితవు పలికాడు.