ఆనంద్ నిష్క్రమణ
తిబిలిసి (జార్జియా): గతంలో రెండుసార్లు (2000, 2002లో) చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఈసారి ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. 15 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ బరిలోకి దిగిన ఆనంద్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఆశలు సజీవంగా ఉండాలంటే ఆంటోన్ కొవల్‌యోవ్ (కెనడా)తో గురువారం జరిగిన రెండో గేమ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
దాంతో 0.5–1.5తో కొవల్‌యోవ్ చేతిలో ఆనంద్ ఓడిపోయాడు. మరోవైపు లీ క్వాంగ్ లియెమ్ (వియత్నాం)తో జరిగిన రెండో గేమ్‌ను విదిత్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 1.5–0.5తో గెలుపొంది మూడో రౌండ్‌కు చేరాడు. పెంటేల హరికృష్ణ–సేతురామన్‌ల మధ్య; ఆదిబన్–నెపోమ్‌నియాచి (రష్యా)ల మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో శుక్రవారం టైబ్రేక్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.