రూ.2,199 కోట్లకు ఐపీఎల్ టైటిల్ హక్కులు
ఐదేళ్ల కాలానికి ‘వివో’ భారీ ఒప్పందం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ హక్కులను ‘వివో’ మొబైల్ కంపెనీ దిమ్మతిరిగే రేటుతో దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి ఏకంగా రూ.2,199 కోట్ల భారీ ధరతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గత ఒప్పందంకన్నా 554 శాతం అధికం కావడం విశేషం. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున 2016–17 సీజన్‌లో వివో కంపెనీయే టైటిల్‌ను స్పాన్సర్ చేసింది. కానీ ఈసారి మాత్రం రేటు విషయంలో దూకుడుగా వెళ్లింది. ‘వచ్చే ఏడాది నుంచి 2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను రూ.2,199 కోట్లకు వివో మొబైల్ కంపెనీ దక్కించుకుంది.
క్రీడా ఈవెంట్స్, మైదానంలో కార్యక్రమాలు, మార్కెటింగ్ ప్రచారాల విషయంలో మున్ముందు ఐపీఎల్, వివో కలిసి పనిచేస్తాయి’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా ఆదాయం రానుంది. ఆగస్టు 1, 2017 నుంచి జూలై 31, 2022 మధ్య కాలానికి ఐపీఎల్ టైటిల్ హక్కుల కోసం గత నెల బిడ్స్‌ను ఆహ్వానించారు. వివోకు పోటీగా మరో మొబైల్ కంపెనీ ఒప్పో రూ.1,430 కోట్లతో పోటీకి వచ్చింది. మరోసారి వివోతో కలిసి పనిచేస్తుండటంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు వీకే ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. లీగ్ ప్రారంభంలో డీఎల్‌ఎఫ్ (2008–2012) టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగగా... ఆ తర్వాత పెప్సీ (2014–15), వివో తెరపైకి వచ్చాయి.